మాస్ మహారాజ్ రవితేజ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగాడు. నటనతో రవితేజ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాస్ లో ఇతనికి భీభత్సమైన క్రేజ్ ఉంది. అలాంటి రవితేజ ఫ్యామిలీ నుండీ ఒక హీరో వస్తున్నాడు అంటే.. సహజంగానే అంచనాలు ఏర్పడతాయి. అలా మాధవ్ భూపతి రాజు (Maadhav Bhupathiraju) పై కూడా ఆడియన్స్ దృష్టి పడింది. ఇతను రవితేజ పెద్ద సోదరుడు రఘు కుమారుడు. వాస్తవానికి ‘మిస్టర్ ఇడియట్’ అనే సినిమాతోనే హీరోగా లాంచ్ అవ్వాలి. కానీ ఎందుకో ఆ సినిమా రిలీజ్ కి నోచుకోలేదు. అందువల్ల ‘మారెమ్మ’ (Maremma) అనే రా అండ్ రస్టిక్ మూవీతో హీరోగా లాంచ్ అవుతున్నాడు. మరి ఈ ‘మారెమ్మ’ మాధవ్ కి ఎలాంటి డెబ్యూ అందించిందో తెలుసుకుందాం రండి:
కథ: తెలంగాణలోని మహిషాపురం అనే మారుమూల గ్రామం. ఒకసారి ఈ గ్రామంలో తీవ్ర విపత్తు సంభవించి జననష్టం, పంటనష్టం జరుగుతుంది. తినడానికి తిండి లేకపోవడంతో పాటు, జనాలు ఏదో తెలియని వ్యాధి బారిన పడి మరణిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఊరి జనాలు మారెమ్మ అమ్మవారిని ఆశ్రయిస్తారు. ఎన్నో జంతుబలులు సమర్పిస్తారు, కానీ వారి కష్టాలు తీరవు. అయితే, ఆ ఊరి పెద్దల్లో ఒకరు తన దున్నపోతును తీసుకొచ్చి బలివ్వడంతో వాళ్ళ ఇబ్బందులు తీరుతాయి.దీంతో ప్రతి పదేళ్లకోసారి ఓ దున్నపోతును బలివ్వడం ఆ ఊరి జనాలు ఆనవాయితీగా మార్చుకుంటారు. ఈ క్రమంలో, ఆ ఊరికి చెందిన ఓ ఒంటికన్ను పూజారి.. రాబోయే మూడేళ్లలో ఒకరింట్లో దున్నపోతు పుడుతుందని, దాన్ని పెంచి పెద్దయిన తర్వాత బలివ్వాలని చెబుతాడు.
అలా పుట్టిన ఓ దున్నపోతుకు ‘మారి(Maremma)’ అని పేరు పెడతారు. దాన్ని పెంచే బాధ్యతను కర్ణ అలియాస్ కర్నెకి (మాధవ్ భూపతి) అప్పగిస్తాడు ఆ ఊరి పెద్ద ధర్మన్న (వినోద్ కుమార్). కర్ణ తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో, అతని తల్లే అతనికి అన్నీ తానై పెంచుతుంది. కర్ణకి మారి అంటే ప్రాణం. అలాగే తన మరదలు మంజు (దీపా బాలు) అన్నా ఎంతో ప్రేమ. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే, మరోవైపు ఎంతో ఇష్టంగా పెంచుకున్న మారిని బలివ్వడం కర్ణకు నచ్చదు. ఈ విషయాన్ని తన స్నేహితులకు చెబుతాడు. సరిగ్గా బలివ్వాల్సిన రోజు వచ్చినప్పుడు నిజంగానే మారి మాయమవుతుంది. అసలు మారిని అపహరించింది ఎవరు? జలంధర్ (వికాస్ వశిష్ట) మహిషాపురం జనాలపై ఎందుకు పగ పెంచుకున్నాడు? చివరికి కర్ణకి మారి దొరికిందా? లేదా? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: కర్ణగా మాధవ్ భూపతి బాగానే సెట్ అయ్యాడు. అతని మేకోవర్ బాగుంది. కానీ ఒక్కటంటే ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా పలికించలేకపోయాడు. అతని యాక్టింగ్లో ఈజ్ కూడా లేదు. అందుకే అనుకుంట దర్శకుడు అతనికి సినిమా మొత్తంలో ఒక్క క్లోజప్ షాట్ కూడా పెట్టలేదు. డైలాగ్ డెలివరీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అతను పలికిన ఏ డైలాగ్ కూడా ఆడియన్స్ కి అర్ధం కాదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. యాక్టింగ్ పరంగా చాలా ఇంప్రూవ్ అవ్వాలి మాధవ్. మంజు పాత్రలో దీప బాలు బాగా సెట్ అయ్యింది. ఆమె లుక్స్, మేకోవర్ అంతా బాగుంది.
కాకపోతే పాత్రలో డెప్త్ లేదు. వినోద్ కుమార్ పాత్ర కూడా కన్విన్సింగ్ గా లేదు. విలన్ గా చేసిన వికాస్ వశిష్ట కూడా ఆ పాత్రకి అస్సలు సెట్ అవ్వలేదు. అతని డైలాగులు, ఎక్స్ప్రెషన్స్ ఏవీ కూడా ఆకట్టుకోవు. ‘బలగం’ రూపలక్ష్మీ పాత్ర, మేకోవర్ కొత్తగా ఉన్నాయి. ఆమె కూడా బాగా చేసింది. ఇంకాసేపు ఈ పాత్రని కంటిన్యూ చేస్తే బాగుండేది అనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలిగించింది రూపాలక్ష్మీ. మిగతా నటీనటుల పాత్రలు అంతంత మాత్రమే.
సాంకేతిక నిపుణుల పనితీరు: రూటెడ్ స్టోరీస్ కి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా వాటికి రా అండ్ రస్టిక్ ఫీల్ తగిలిస్తే ఆడియన్స్ ఎగబడి చూస్తున్నారు. ‘రంగస్థలం’ నుండి ఇటీవల వచ్చిన ‘ఇరుముడి’ ఎలాంటి విజయాలు అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఈ రూటెడ్(మట్టికథలు) కథల నుండీ ఆడియన్స్ కోరుకునేది సహజత్వం. ఇంకా చెప్పాలంటే ఒరిజినాలిటీ. అది ‘మారెమ్మ’ (Maremma) లో పూర్తిగా లోపించింది. సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాలకే ట్రాక్ తప్పిన ఫీలింగ్ అందరికీ కలుగుతుంది. అలా డిస కనెక్ట్ అయిపోయిన ఆడియన్స్ ఎక్కడా కనెక్ట్ కారు. నెక్స్ట్ సీన్ ముందుగానే ఊహించే విధంగా ఉంటుంది. అలా వచ్చే సన్నివేశాల్లో ఒక్కటి కూడా పాస్ మార్కులు వేసే విధంగా ఉండదు. పైగా సినిమా మొత్తం అయిపోయాక.. ‘దేవుడు గురించి, భక్తి గురించి, జంతు బలుల’ గురించి కొంత ఫిలాసఫీ చెబుతారు. దానికి సినిమా కథకి అస్సలు సంబంధం ఉండదు.
బహుశా ‘నేను పేపర్ మీద రాసుకున్న కథ ఒకటి.. తీసింది ఇంకొకటి’ అని దర్శకుడు పరోక్షంగా చెప్పాడు అనుకోవాలేమో. మిగిలిన అంశాల గురించి మాట్లాడుకోవాలంటే.. ‘మారెమ్మ’ కి (Maremma) ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ మ్యూజిక్. 3 పాటలు వినసొంపుగా ఉన్నాయి. ‘మారి..’ ‘బావ బావ’ సాంగ్స్ వినసొంపుగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే పర్వాలేదు. సినిమాటోగ్రఫీ చాలా వీక్ గా ఉంది. కొన్ని సన్నివేశాల్లో హీరో మాట్లాడుతుంటే.. దున్నపోతుకి క్లోజప్ షాట్స్ పడతాయి. ఇంకో చోట దున్నపోతు యాక్షన్ సీన్స్ వస్తుంటే.. కెమెరా యాంగిల్స్ ఇంకెక్కడో ఉంటాయి. లొకేషన్స్ కూడా నేచురల్ గా అనిపించవు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి.
విశ్లేషణ: ‘మారెమ్మ’ (Maremma) సినిమాలో 2, 3 పాటలు మినహా గొప్పగా చెప్పుకునే విధంగా ఇంకో అంశం కనిపించదు. థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులను పూర్తిస్థాయిలో డిజప్పాయింట్ చేసి పంపే సినిమా ఇది.
ఫోకస్ పాయింట్: ‘మరెమ్మా’… కష్టమమ్మా
రేటింగ్: 1/5