‘భలే భలే మగాడు’ సినిమాలో బూతు లేకుండా వినోదాన్ని పంచి సిసలైన విజయాన్ని చేజిక్కించుకున్నాడు దర్శకుడు మారుతి. వెంటనే వెంకటేష్ లాంటి హీరో అవకాశం ఇచ్చేసరికి ఇక తన దశ తిరిగినట్టే అని భావించి తనకు తానే ‘స్టార్ డైరెక్టర్’ అని బిరుదిచ్చేసుకున్నాడు. తీరా ‘బాబు బంగారం’ తెరమీద పడ్డాక తెలిసొచ్చింది నకిలీ బంగారానికి అసలు బంగారం అయిన వెంకీని పూతగా వేసి అమ్ముకునే ప్రయత్నం చేశాడని.ఇదంతా ఫ్లాష్ బ్యాక్ అనుకుంటే.. ఇప్పుడు వర్తమానంలోకి వచ్చేద్దాం.
ప్రస్తుతం కుర్రహీరో హవీష్ తో ఓ సినిమా చేస్తోన్న మారుతి తన కెరీర్ ని మళ్ళీ గాడిలో పెట్టేందుకు మరో యువ హీరోని లైన్లో పెడుతున్నాడట. అతడే.. వరుస విజయాలతో దూసుకెళుతోన్న శర్వానంద్. చంద్రమోహన్ అనే కొత్త దర్శకుడితో ఇప్పటికే ఓ సినిమాని పూర్తి చేసిన శర్వానంద్ సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్న ‘శతమానం భవతి’ సినిమాకీ త్వరలో గుమ్మడికాయ కొట్టనున్నాడు. వీటి తర్వాత శర్వా మరే దర్శకుడికీ మాటివ్వలేదు. దాంతో ఆ ఖాళీని భర్తీ చేసే ప్రయత్నాలు మొదలెట్టాడట మారుతి. ఇప్పటికే ఓ లైన్ సిద్ధం చేసిన ఈ దర్శకుడు త్వరలో శర్వాకి వినిపించి ‘ఓకే’ చేయించుకోవాలని అనుకుంటున్నాడు. మరి శర్వా ఎలా స్పందిస్తాడో..?