మొదటి నుండీ విభిన్న కథలు ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈఏడాది ‘ఎఫ్2’ చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న వరుణ్ త్వరలోనే హరీష్ శంకర్ డైరెక్షన్లో ‘జిగర్తాండ’ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో వరుణ్ కనిపించనున్నాడని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో పాటూ కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడితో కూడా ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు.
బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. ఈ రెండు చిత్రాల కోసం వరుణ్ చాలా కష్టపడుతున్నాడు. గత కొంత కాలంగా అమెరికాలోని ‘లాస్ ఏంజెల్స్’ లో బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు వరుణ్. ఒలింపిక్ క్రీడల్లో పాల్గొని పతకాలు కూడా సాధించిన టోనీ జెఫ్రీస్ సారథ్యంలో గత రెండు నెలలుగా శిక్షణ తీసుకుంటున్నాడు వరుణ్. దీనికి సంబందించి.. తన ఇన్స్టాగ్రామ్లో ఒక పిక్ షేర్ చేస్తూ “గత రెండు నెలలుగా ఈ వ్యక్తితో అద్భుతంగా గడిచింది.. టోనీ జెఫ్రీస్.. నిన్ను మిస్ అవుతాను. మరోసారి త్వరలో ట్రైనింగ్ లో కలుద్దాం” అంటూ పేర్కొన్నాడు వరుణ్. ఈ ఫోటోలో వరుణ్ తేజ్ తో పాటుగా తన ట్రైనర్ టోనీ కూడా ఉన్నాడు. ఇక ఈ పిక్ లో వరుణ్ కాస్త ఒళ్ళు తగ్గి.. గడ్డం, మీసాలు పెంచి ఓ ఫారినర్ లా కనిపిస్తున్నాడు, మన సినిమా భాషలో చెప్పుకోవాలంటే… ఈ పిక్ లో వరుణ్ ఓ హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు. వరుణ్ కొత్త లుక్ కు సోషల్ మీడియా లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ‘సూపర్ వరుణ్ అన్నా’ అంటూ కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.