మంచి హిట్ కోసం చూస్తున్న యంగ్ హీరో నాగ శౌర్యకి ఛలో రూపంలో సూపర్ హిట్ లభించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఐరా క్రియేషన్స్ బ్యానర్లో శంకర్ ప్రసాద్ సమర్పణలో, ఉష నిర్మించి లాభాలను అందుకున్నారు. సొంత బ్యానర్లో హిట్ చూసిన నాగశౌర్య మళ్లీ సొంత బ్యానర్లోనే మరో సినిమాకి సిద్ధమవుతున్నారు. నూతన దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో “నర్తనశాల” అనే చిత్రం చేయనున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా అనేక పేర్లు పరిశీలించిన డైరక్టర్ చివరికి మెహ్రీన్ ని సెలక్ట్ చేసినట్లు తెలిసింది. రాజా ది గ్రేట్, మహానుభావుడు చిత్రాలతో హిట్ అందుకున్న ఈ భామకి రీసెంట్ గా వచ్చిన అపజయాలు క్రేజ్ ని ఏ మాత్రం తగ్గించలేకపోయాయి. విజయ్ దేవరకొండ ద్విభాషా చిత్రం నోటాలో హీరోయిన్ గా సెలక్ట్ అయిన ఈ బ్యూటీ, తాజాగా నాగశౌర్య సరసన హీరోయిన్ గా ఎంపికైంది. నాగశౌర్య, మెహ్రీన్ కాంబినేషన్ కొత్త అనుభూతిని పంచుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 12నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ దసరాకి థియేటర్లోకి రానుంది.