సినీ పరిశ్రమలో అందం, ఆకారం, పోలికలు.. ఇవన్నీ హీరోయిన్లపై ఎప్పటికప్పుడు ఒత్తిడిని పెంచే అంశాలే. ఈ విషయాన్ని తాజాగా స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్, తన మాటల్లో చాలా భావోద్వేగంగా వెల్లడించారు. వెండితెరపై చిరునవ్వులతో కనిపించే తన వెనుక ఎన్నో మానసిక పోరాటాలు దాగున్నాయని ఆమె చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానులను ఆలోచింపజేస్తున్నాయి.
సోషల్ మీడియాలో వచ్చే బాడీ షేమింగ్ కామెంట్స్ తనను ఒక దశలో పూర్తిగా కుంగదీశాయని మృణాల్ తెలిపారు. బయటకి ఎంత స్ట్రాంగ్‌గా కనిపించినా, ఒంటరిగా ఉన్న సమయంలో మాత్రం ఆ మాటలు మనసును బాగా గాయపరిచేవని చెప్పారు. కొన్ని రాత్రులు కన్నీళ్లతోనే గడిచాయని, నిద్రలేని రాత్రులు తనను మరింత బలహీనంగా మార్చాయని గుర్తు చేసుకున్నారు. ఇతర హీరోయిన్లతో తనను తాను పోల్చుకోవడం వల్ల ‘నాలో ఏదో లోపం ఉందేమో’ అనే భావన పెరిగిపోయిందని ఆమె చెప్పారు.
ఈ ప్రయాణంలో తనకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చిన వ్యక్తిగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ పేరును ప్రస్తావించారు. “ఇతరుల అభిప్రాయాల కోసం మారాల్సిన అవసరం లేదు. ఒక పాత్ర అవసరమైతే తప్ప నిన్ను నువ్వుగా అంగీకరించు” అని అక్షయ్ చెప్పిన మాటలు తన జీవితాన్ని మార్చేశాయని చెప్పారు. ఆ సలహాతోనే ఈ రోజు తాను మానసికంగా ఎంతో స్ట్రాంగ్‌గా ఉన్నానని మృణాల్ స్పష్టం చేశారు. ఇప్పుడు సెల్ఫ్ అక్సెప్టెన్స్‌తో, తనను తాను సంతృప్తి పరచేవాటికే ప్రాధాన్యత ఇస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పిన ఆమె మాటలు అభిమానులకు ప్రేరణగా నిలుస్తున్నాయి.