Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

పాత పాటలు ఏదో తెలియని మ్యాజిక్‌ చేస్తాయి. అందుకే మన సినిమా దర్శకనిర్మాతలు కొత్త సినిమాల్లో నాటి పాటల టచ్‌ ఎక్కడో దగ్గర ఉండేలా చూసుకుంటున్నారు. చాలా వరకు అప్పట్లో హిట్ కొట్టిన, క్లాసిక్‌ అనిపించిన పాటల్ని ఇప్పటి సినిమాల్లో వాడేసుకుంటున్నారు. తొలుత చెప్పా చేయకుండా వాడేసినా.. ఇళయరాజా కేసుల ఎఫెక్ట్‌ పుణ్యమా అని.. చెప్పి, అవసరమైతే డబ్బులు ముట్టజెప్పి మరీ పాటలు వాడుతున్నారు. అవి ఆ సినిమాలకు బాగా కలిసొస్తున్నాయి కూడా. దీనికి ‘కే ర్యాంప్‌’, ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ సినిమాలే ఓ ఉదాహరణ.

Koti

అలా ఓ పాత సినిమా పాటను వాడుకున్న మరో సినిమా ‘డెకాయిట్‌’. అడివి శేష్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా తెరకెక్కిన సినిమా ఇది. అన్నీ అనుకున్నట్లగా జరిగితే వచ్చే నెలలో ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమాలో ఓ పాత పాటను వాడిన నేపథ్యంలో ఆ పాట ఒరిజినల్ దర్శకుడు ఇప్పుడు ఫైర్‌ అవుతున్నారు. పాట మీద తొలి హక్కు తనదే అంటూ ఇళయరాజాలా వాదించడం లేదు కానీ.. కనీసం ఓ మాట చెప్పాలి కదా, క్రెడిట్‌ ఇవ్వాలి కదా అంటున్నారు టాలీవుడ్ సీనియర్ సంగీత దర్శకుడు కోటి.

‘హలో బ్రదర్’ సినిమా కోటి స్వరపరిచిన ‘కన్నె పెట్టరో’ పాటను ఇటీవల ‘డెకాయిట్’ సినిమా టీజర్ కోసం వాడుకున్నారు. ఈ పాట వాడుకున్న అన్నపూర్ణ బ్యానర్‌ వాళ్లు మ్యూజిక్ సంస్థ, నిర్మాతల దగ్గర అనుమతి తీసుకున్నారే తప్ప, మాట వరసకు కూడా తనకు చెప్పలేదని కోటి ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పాట కంపోజ్ చేసిన సంగీత దర్శకుడికి క్రెడిట్ రాకపోవడం ఏంటని అంటున్నారాయన. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. తమ పాటలను తాము రీమిక్స్ చేయాలన్నా రూ.10 లక్షల వరకు ఆడియో కంపెనీలకు ఇవ్వాల్సి వస్తోందని అన్నారాయన. ఈ క్రమంలో గతంలో ఓ సినిమా కోసం దిల్ రాజు ఒక పాట వాడుకున్నందుకు కృతజ్ఞత చూపించారని కోటి తెలిపారు.

 ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus