“భలే మంచిరోజు”, “శమంతకమణి” సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న డైరక్టర్ శ్రీరామ్ ఆదిత్య … నాని, నాగార్జునను కలిపి ఓ మల్టీ స్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఉగాది రోజున మొదలయింది. హైదరాబాద్ లోని మియాపూర్ మెట్రో స్టేషన్లో నాని, రష్మిక మందన్న, సంపూర్ణేష్ బాబుల మీద కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించారు. సెకండ్ షెడ్యూల్ నిన్న రామోజీ ఫిలిం సిటీలో మొదలయింది. నాగార్జున ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు.
దీంతో నాని ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. “తొలిసారి నాగార్జునతో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉంది” అని ట్వీట్ చేశారు. అలాగే నాగార్జునకు సెట్స్ లోకి స్వాగతం పలికారు. నాని వంటి ప్రతిభగల నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నానని నాగార్జున ట్వీట్ చేశారు. ఇలా ఒకరికొకరు ట్విట్టర్ వేదికపై తమ ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినిదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాని డాక్టర్ పాత్రలో కనిపిస్తున్నాడు, నాగార్జున డాన్ పాత్రలో అలరించబోతున్నాడు. కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించబోతున్నారు.