టాలీవుడ్ యువరాణి కాజల్ తన అందం, అభినయంతో పదేళ్లుగా పరిశ్రమలో కొనసాగుతోంది. సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరోలతో నటించి విజయాలను అందుకుంటోంది. అందుకే ఈ బ్యూటీని నానికి జోడీగా అనుకున్నారు. మంచి ఫాలోయింగ్ ఉన్న నటి తన పక్కన జోడీగా నటిస్తుంటే ఆనందపడకుండా.. నాని మాత్రం నో చెప్పారంటా. నాని దేవదాస్ చిత్రం తర్వాత జెర్సీ అనే స్పోర్ట్స్ నేపథ్యం ఉన్న సినిమాను చేయనున్నారు. “మళ్ళీ రావా” ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మూడు షేడ్స్ చూపించబోతున్నారు. దీని తర్వాత ఐతే, అనుకోకుండా ఒక రోజు, మనమంతా వంటి విభిన్నమైన కథలతో విజయాలను అందుకున్న చంద్రశేఖర్ యేలేటి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మైత్రీ మూవీస్ వారు నిర్మించనున్న ఈ మూవీ కోసం హీరోయిన్ వేటలో చిత్ర బృందం పడింది.
మైత్రీ వారు ‘తెరి’ రీమేక్ కోసం రవితేజ కు హీరోయిన్ గా తీసుకునేందుకు గతంలో కాజల్ డేట్స్ తీసుకున్నారట. ఆ సినిమా ఇప్పుడు హోల్డ్ లో పడింది కాబట్టి కాజల్ డేట్స్ ను నాని, చంద్రశేఖర్ ఏలేటి సినిమాకు వాడుకుందామంటే నాని నో చెప్పారు. అందుకు కారణం ఏమిటని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. కాజల్ తనకంటే పెద్దదిగా కనిపించే అవకాశం ఉందనేది ఒకటయితే… కథకి కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందనేది మరో కారణమని సమాచారం. ఈ రెండు కోణాల్లో అలోచించి నాని ‘నో’ చెప్పాడని ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కొత్త హీరోయిన్ ని వెతికే పనిలో చంద్రశేఖర్ టీమ్ పడింది.