ఇంతకుముందు సినిమాకి సంబంధించిన విషయం కానీ హీరో లుక్ కానీ బయటకి రావాలంటే చిత్ర బృందం రిలీజ్ చేసేవరకూ ఎవరికీ తెలిసేది కాదు. కానీ.. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసరికి హీరో గెటప్, లుక్ అనేది సినిమా యూనిట్ ఎనౌన్స్ చేయడానికి ముందే ఆన్లైన్ లో ప్రత్యక్షమవుతున్నాయి. అందుకే ఇటీవల ఫస్ట్ లుక్స్ కి అంతగా ప్రాముఖ్యత ఉండడం లేదు. అందుకు నిదర్శనం మొన్న విడుదలైన “నా పేరు సూర్య” టీజర్. నిజానికి సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ఎప్పుడైనా సరే ఫస్ట్ లుక్ తోనే మొదలవుతాయి. కానీ.. అల్లు అర్జున్ లుక్ ఆల్రెడీ జనాలకి తెలిసిపోవడంతో మళ్ళీ పోస్టర్ విడుదల చేయడం ఎందుకని భావించిన “నా పేరు సూర్య” చిత్రబృందం డైరెక్ట్ గా టీజర్ ను విడుదల చేసేసింది.
ఇప్పుడు మహేష్ బాబు తాజా చిత్రం “భరత్ అనే నేను” టీమ్ కూడా ఆ ఫార్మాట్ ను ఫాలో అవ్వనుందని వినికిడి. తొలుత జనవరికి ఫస్ట్ లుక్ విడుదల చేద్దామనుకొన్న చిత్రబృందం ఆఖరి నిమిషంలో ఆ ఆలోచనను వెనక్కి తీసుకుంది. ఇప్పుడు సంక్రాంతి కానుకగా “భరత్ అనే నేను” ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయనున్నారని సమాచారం. ఆల్రెడీ మహేష్ లుక్ లీకైపోవడం సినిమాకి సంబంధించిన చాలా స్టిల్స్ బయటకి పొక్కడంతో చిత్రబృందం ఈ డెసిషన్ తీసుకొన్నట్లున్నారు. చూద్దాం మరి ఇప్పటికే చాన్నాళ్ల నుండి మహేష్ అభిమానుల్ని ఉరిస్తున్న చిత్రబృందం ఈ సంక్రాంతికైనా వారిని సంతుష్టులను చేస్తుందో లేదో.