దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి బాహుబలి కంక్లూజన్ ని అద్భుతంగా తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీ లో వేసిన భారీ సెట్ లో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ నిపుణుల సమక్షంలో షూటింగ్ కొనసాగుతోంది. ఈ భీకర పోరాటంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానాలతో పాటు ఐదువేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. అయితే షూటింగ్ కి అంతరాయం ఏర్పడిందని, అనుకున్న సమయం కంటే షూటింగ్ ఆలస్యం అవుతుందనే వార్తలు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
ఈ రూమర్లలను బాహుబలి చిత్ర యూనిట్ కొట్టి పడేసింది. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ జరుగుతోందని, డిలే అవడం లేదని స్పష్టం చేసింది. యుద్ధ సన్నివేశాలు అనుకున్న విధంగా రావడానికి రాజమౌళి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదని, అందుకోసం అయన ముందుగానే కొన్ని రోజులు షెడ్యూల్లో భాగం చేశారని వెల్లడించారు. ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రల్ 28 న విడుదల చేయనున్నారు.