నందమూరి బాలకృష్ణకు సెంటిమెంట్స్ అనేవి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను నటించే సినిమాల ప్రారంభ ముహూర్తాలు మొదలుకొని సదరు సినిమాకి మొదటి షో ఎప్పుడు పడాలి, ఒక్కోసారి సెన్సార్ షో ఎప్పుడు పడాలి అనే విషయానికి కూడా బాలయ్య ముహూర్తాలు పాటిస్తుంటారు. ఒక్కోసారి ఆయన ముఖ్య అతిధిగా వెళ్ళే వేడుకలకు కూడా బాలయ్య ముహూర్తం పెడుతుంటారు. ఈ ముహూర్తాల సెంటిమెంట్ తోపాటు బాలయ్యకు మరో సెంటిమెంట్ కూడా ఉంది. అదే “సింహా” సెంటిమెంట్. తాను నటించే సినిమాలకు వీలైనంతలో “సింహా” అనే టైటిల్ యాడ్ అయ్యేలా జాగ్రత్తపడతాడు బాలయ్య.
తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అయిన “సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు, సింహా” చిత్రాల్లో సింహం ఉండడమే అందుకు కారణం. రీసెంట్ బ్లాక్ బస్టర్ “జైసింహా”లో కూడా సింహం ఉండడంతో కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం టైటిల్లో కూడా సింహా ఉండాలని పట్టుబడుతున్నాడట. దాంతో కె.ఎస్.రవికుమార్ మొదట ఈ చిత్రానికి ఒక క్లాసీ టైటిల్ అనుకొన్నప్పటికీ.. బాలకృష్ణ అభీష్టం మేరకు “రాయల సింహా” అనే టైటిల్ కు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మరి బాలయ్యకు ఈ సింహా సెంటిమెంట్ ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.