విజయం కుదురుగా కూర్చోనివ్వదు. పడుకోనివ్వదు. అంతెందుకు ఎవరి మాట వినినివ్వదు. తన మాటే నెగ్గాలని.. తాను చేసేదే కరక్ట్ అనే గర్వాన్ని అందిస్తుంది. ఆ గర్వంలోనే కంగనా ఉందని బాలీవుడ్ వర్గాల వారు చెప్పుకుంటున్నారు. ఆమెతో కలిసి పనిచేయలేక తాజా ప్రాజక్ట్స్ నుంచి ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. ప్రస్తుతం కంగనా “మణికర్ణిక – ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ” అనే మూవీ చేస్తోంది. ఈ సినిమాని టాలీవుడ్ డైరక్టర్ క్రిష్ దర్శకునిగా వ్యవహరించారు. దాదాపు 80 శాతం షూటింగ్ చేశారు. ఈ డైరక్షన్ శాఖలో ఎక్కువగా కంగనా ఇన్వాల్వ్ మెంట్ కి విసిగి పోయిన క్రిష్ ప్రాజక్ట్ నుంచి బయటికి వచ్చి ఎన్టీఆర్ బయోపిక్ ని అందుకున్నారు. క్రిష్ బయటికి పోగానే అతను షూట్ చేసిన 43 రోజుల విజువల్స్‌ని కంగనా కట్ చేయించి వాటన్నిటినీ తిరిగి రీషూట్ చేస్తోంది. ఇందులో సోనూ సూద్ కష్టపడి నటించిన మల్ల యుద్ధ సన్నివేశాల్ని తొలగించింది.
దీంతో అతను కోపంతో మణికర్ణిక ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దీని గురించి అందరూ మాట్లాడుకుంటుండగానే మరొకరు పక్కకు తప్పుకున్నారు. అతనే నిర్మాతల్లో ఒకరైన సంజయ్ కుట్రీ. జీ స్టూడియోస్, కమల్ జైన్ సమర్పణలో కైరోస్ కంటెంట్ స్టూడియోస్ బ్యానర్లో నిషాద్ పిట్టి తో కలిసి ఇతను ఈ సినిమాని నిర్మించాలని అనుకున్నారు. కానీ కంగనా చేస్తున్న పనుల వల్ల 70 కోట్లతో అయిపోతుందనుకున్న నిర్మాణ వ్యయం 100 కోట్లకు చేరుకుంది. దీంతో సంజయ్ తప్పుకున్నట్టు సమాచారం. అతని స్థానంలో కొత్త నిర్మాతని తీసుకున్నట్టు బాలీవుడ్ మీడియా కథనాలను ప్రచురిస్తున్నాయి. దీంతో ఈ సినిమా 2019 జనవరి 25న రిలీజ్ కావడం కష్టమేనని ట్రేడ్ వర్గాల వారు భావిస్తున్నారు.