మహానుభావుడు సినిమా విజయం తర్వాత శర్వానంద్ రెండు సినిమాలు చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు.. సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా కోసం కష్టపడుతున్నారు. పడి పడి లేచే మనసులో బెంగాలీ భామగా సాయి పల్లవి నటిస్తోంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన స్టైల్ అందరినీ ఆకట్టుకుంది. కలకత్తా నేపథ్యంలో సాగే ఈ మూవీలో సాయి పల్లవి మెడికల్ స్టూడెంట్ గా కనిపించబోతున్నట్టు తెలిసింది. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ విజయం తర్వాత హను రాఘవపూడి చేసిన లై మూవీ నిరాశపరచడంతో.. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని హను మంచి లవ్ స్టోరీని తీసుకున్నారు. షూటింగ్ కూడా పూర్తికావచ్చిందని చిత్ర బృందం ఆనందించేలోపు సినిమాకి ఊహించని బ్రేక్ పడింది. ఎందుకని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది.
ఈ మధ్యే వచ్చిన సాయి ధరమ్ తేజ్ మూవీ తేజ్ ఐ లవ్ యూ కథలో ఓ ప్రమాదం వల్ల హీరోయిన్ కు మెమరీ లాస్ కావడం అనే పాయింట్… పడి పడి లేచే మనసులో కూడా ఉందని సమాచారం. కాకపోతే అది హీరో కోణంలో ఉంటుందని టాక్. అయినా ఆ సినిమాని ప్రతిబింబించేవిధంగా ఉండకూడదని దర్శకుడు హను రాఘవపూడి స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. అందుకే కొన్ని రోజులు షూటింగ్ ని నిలిపివేసి.. తేజ్ ఐ లవ్ సినిమాలోని సన్నివేశాలు పోలినవి ఇదివరకే తీసి ఉంటే వాటిని తొలగించి.. ఆ స్థానాల్లో కొత్త సన్నివేశాన్ని షూట్ చేయాలనీ అనుకుంటున్నారు. ఇందుకోసం బడ్జెట్ పెరిగినా వెనక్కి తగ్గడం లేదని తెలిసింది.