అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నుండి ఓ సినిమా వస్తుంది అంటే సహజంగానే అందరి ఫోకస్ ఆ సినిమాపై పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలా ‘పళ్ళబురుసు’ అనే చిన్న సినిమా కొద్దిరోజుల నుండీ వార్తల్లో నిలుస్తుంది. టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. ఇలాంటి చిన్న సినిమాలు గతంలో సైలెంట్ గా వచ్చి బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు క్రియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ సినిమా కూడా అలా అద్భుతాలు సృష్టించే విధంగా ఉందా? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ: శంభో(సుధాకర్ రెడ్డి) వయసు మీద పడ్డ ఓ వృద్ధుడు. ఒకసారి పంటి నొప్పి వస్తుందని హాస్పిటల్ కి వెళ్తే.. డాక్టర్ వేప పుల్లలకి బదులు పళ్ళబురుసు(టూత్ బ్రష్) వాడాలని సూచిస్తుంది. అయితే డాక్టర్ రాసిన మందులు ఆ హాస్పిటల్లో ఉండవు. దీంతో కొడుకు తిరుపతికి(మురళీధర్ గౌడ్) ఆ ప్రిస్క్రిప్షన్ ఇచ్చి పళ్ళబురుసుతో పాటు పేస్ట్ అలాగే మందులు తీసుకురమ్మని చెబుతాడు శంభో. తిరుపతి ఓ రెయిల్ వే గేట్ మెన్. అయితే తిరుపతికి తాగుడు అలవాటు ఎక్కువ. పైగా తండ్రి అంటే చిన్న చూపు. జనాల మధ్య తనని తిట్టిపోస్తాడు అనే కోపం కూడా తండ్రిపై ఎక్కువ ఉంటుంది తిరుపతికి. అయినప్పటికీ ఒకసారి పళ్ళబురుసు తెస్తాడు.
కానీ అదే రోజు తన కూతురు రేఖకి(సుప్రియా) పెళ్లి చూపులు జరగడంతో వాటిని పక్కన పెట్టేస్తాడు. ఆ టైంలో వచ్చిన ఓ చిన్న పిల్లాడు ఆ పళ్లబురుసుని మాయం చేసేస్తాడు.మరోవైపు రేఖకి పెళ్లి కుదిరిన విషయం కూడా తండ్రి శంభో వద్ద దాచిపెడతాడు తిరుపతి. దీంతో తండ్రి మానసికంగా కృంగిపోతాడు. ఎలాగైనా కొడుకుపై కోపాన్ని తీర్చుకోవాలని డిసైడ్ అవుతాడు శంభో. ఈ క్రమంలో కోర్టుకి వెళ్ళి తనకి పళ్ళబురుసు కొనివ్వలేదు అనే కారణం చెప్పి మెయింటెనెన్స్ యాక్ట్ సెక్షన్ 144 ప్రకారం కొడుకు తిరుపతిపై కేసు పెడతాడు శంభో. ఆ తర్వాత ఏమైంది? ఇద్దరిలో ఎవరు కేసు గెలిచారు? మధ్యలో రవి(ప్రజ్వల్) శ్వేత(గోమతి రెడ్డి)..ల ప్రేమ కథ ఏమైంది? అనేది మిగిలిన కథ.!
నటీనటుల పనితీరు: ఈ సినిమా కథ చాలా చిన్నది. పైగా 2 పాత్రల పైనే ఎక్కువగా ఆధార పడిన కథ. దీంతో ఆ భారం అంతా తండ్రి పాత్ర చేసిన సుధాకర్ రెడ్డి, కొడుకు పాత్ర చేసిన మురళీధర్ గౌడ్..ల పై ఎక్కువ పడింది. వాళ్ళు తమ పాత్రలకి వందకి వంద శాతం న్యాయం చేశారు. వీళ్ళని తప్ప ఈ పాత్రలకి మరెవ్వరినీ ఊహించుకోలేం. అంత చక్కగా, బాధ్యతగా నటించారు. రవి, శ్వేత..ల ప్రేమ లవ్ ట్రాక్ సినిమా నిడివి పెంచడానికి తప్ప.. కథలో ఇమడలేదు. అయినప్పటికీ రవి పాత్రలో ప్రజ్వల్ బాగా చేశాడు. శ్వేత పాత్రలో గోమతి లుక్స్ కూడా క్యూట్ గా ఉన్నాయి. మిగిలిన నటీనటులు తమ పాత్రలకి న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు: పళ్ళబురుసు అంటే టూత్ బ్రెష్ అనే విషయం చాలా మందికి తెలీదు. అందువల్ల ‘పళ్ళబురుసు’ అనే టైటిల్ తోనే అందరిలోనూ కథ,కథనాలు ఏమై ఉంటాయి అనే ఆసక్తి నెలకొంది. దానికి తోడు ట్రైలర్లో పళ్ళబురుసు కోసం తండ్రి కొడుకుపై కేసు పెట్టడం.. అనేది మరింతగా క్యూరియాసిటీ పెంచింది. వాస్తవానికి ‘కొడుకు సరిగ్గా పట్టించుకోవడం లేదు అని తండ్రి అతన్ని కోర్టుకు లాగడం’ అనే పాయింట్ గతంలో మనం ‘సూరిగాడు’ సినిమాలో చూశాం. అయితే అది పూర్తిగా ఎమోషన్స్ తో కూడిన ఫ్యామిలీ డ్రామా. కానీ ‘పళ్ళబురుసు’తో ఓ టిపికల్ ఫిలాసఫీ చెప్పాలనే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఉదయ్ చౌహాన్. అందుకు అతను ఎంపిక చేసుకున్న కోర్ పాయింట్ కూడా కన్వెన్సింగ్ గా ఉంది.
ఫస్ట్ హాఫ్ బాగానే అనిపిస్తుంది. పెద్దగా కంప్లైంట్స్ ఏమీ అనిపించవు. కానీ సెకండాఫ్లో కథ అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఊర్లల్లో ఉండే జనాలు చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు పెట్టుకుంటారు. ‘అరవింద సమేత’ లో 5 రూపాయల ఫ్యాక్షన్ లాంటివి అనమాట. ఆ గొడవల వల్ల రిలేషన్స్ ఎలా దెబ్బతింటాయి అనేది ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు. కానీ ఈ కథలో కొడుకు రియలైజ్ అయ్యే విధానం ఏదైతే ఉంటుందో అది అంత ఎఫెక్టివ్ గా ఉండదు. టెక్నికల్ గా చూసుకుంటే.. పవన్ సి హెచ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు కూడా వినసొంపుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు కూడా కథకి తగ్గట్టు ఉన్నాయి.
విశ్లేషణ: ‘పళ్ళబురుసు’ ఓ రూటెడ్ స్టోరీ. ‘బలగం’ రేంజ్ ఇంపాక్ట్ ఇవ్వగల ఎమోషన్,సెటప్ ఇందులో ఉన్నాయి. కానీ క్లైమాక్స్ హడావిడి హడావిడిగా తేల్చేయడంతో ఆ ఇంపాక్ట్ మిస్ అయ్యి ఓ మంచి ప్రయత్నంగా మిగిలిపోతుంది.
ఫోకస్ పాయింట్: టిపికల్ ఫిలాసఫీ
రేటింగ్: 2.5/5