కథ బాగుండాలి.. ఆ కథని వెండితెరపై బాగా చెప్పగలగాలి.. అంతే తెలుగు ప్రేక్షకులు కోరుకొనేది. అంతేగానీ అది పాత కథ.. కొత్త కథ.. మాస్ కథ.. క్లాస్ కథ అని పట్టించుకోరని రంగస్థలం సినిమా ద్వారా మరో సారి నిరూపించారు. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంతలు జంటగా నటించిన ఈ మూవీ విడుదలయిన రోజు నుంచి కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. 150 కోట్ల క్లబ్ లో చేరడానికి పరుగులు తీస్తోంది. ఈ సినిమాని చూసిన టాలీవుడ్ డైరక్టర్లు, ఆర్టిస్టులు చిత్ర యూనిట్ ని అభినందించారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం చూడలేదని మెగా అభిమానులు కొంత బాధగా ఉండేవారు. నిన్న పవన్ తన భార్యతో కలిసి సినిమాని చూసారు. వారితో రామ్ చరణ్, ఉపాసనలు కూడా సినిమాని చూసారు. థియేటర్ నుంచి బయటికి వచ్చిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు.
“‘తొలిప్రేమ’ తర్వాత నేను బయటికొచ్చి చూసిన సినిమా ఇది. ఎందుకో ఈ సినిమాను థియేటర్లోనే చూడాలనిపించింది. అద్భుతమైన సినిమా. నా మనసుకు బాగా నచ్చింది. నిర్మాత నవీన్ గారు గొప్ప సినిమా తీశారు. సుకుమార్ వాస్తవానికి దగ్గరగా ఉండే కథతో సినిమా చేశారు.” అని ప్రశంసించారు. అంతేకాదు ఈ సినిమా గురించి మిగతా విషయాల్ని సక్సెస్ మీట్లో మాట్లాడతానని చెప్పి ఫ్యాన్స్ లో సంతోషాన్ని నింపారు. ఈ మధ్య మెగా హీరోల సినీ వేడుకల్లో పవన్ పాల్గొనడం లేదు. చాలా గ్యాప్ తర్వాత రంగస్థలం సక్సస్ మీట్ లో పాల్గొంటారని స్వయంగా చెప్పారు. సో ఒకే వేదికపై చిరు, పవన్, రామ్ చరణ్ తేజ్ లను చూసే అవకాశం లభించనుంది.