యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రంతో బాలీవుడ్ సినీ ప్రముఖులను సైతం ఆకర్షించారు. హిందీలో డబ్ అయి రిలీజ్ అయిన బాహుబలి స్ట్రైట్ చిత్రంతో సమానంగా వసూళ్లను రాబట్టాయి. అందుకే ప్రభాస్ తో మూవీ చేయాలని అక్కడి నిర్మాతలు క్యూ కట్టారు. ఆ విషయంపై ప్రభాస్ మాట్లాడుతూ ” ‘‘బాలీవుడ్ నుంచి నాకు మంచి ఆఫర్లు వచ్చాయి. ‘బాహుబలి కంక్లూజన్’ చేస్తుండటంతో ఆ సినిమాల గురించి ఆలోచించలేదు. అంతే కాకుండా బాహుబలికి ముందు ఇద్దరికీ మాటిచ్చాను. వారి సినిమాలు పూర్తి చేసిన తర్వాతనే బాలీవుడ్ ఎంట్రీ గురించి ఆలోచిస్తాను” అని చెప్పారు.
ఆ ఇద్దరు ఎవరో కాదు .. రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్, జిల్ ఫేమ్ రాధ కృష్ణ. ఈ రెండు ప్రాజెక్టులను యూవీ క్రియేషన్స్ వాళ్లే నిర్మించనున్నారు. ఈ రెండు సినిమాలు ఏకకాలంలో తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కనున్నాయి. ఇంకా ప్రభాస్ మాట్లాడుతూ యశ్ రాజ్ వాళ్లు ధూమ్-4 కోసం తనని అడిగారని వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపడేశారు. బాలీవుడ్ నుంచి ఎవరెవరు తనని సంప్రదించారో ఆ వివరాలను వెల్లడించడానికి ప్రభాస్ నిరాకరించారు. రెండు ప్రాజెక్టులు పూర్తి అయిన తర్వాత హిందీలో డైరక్ట్ మూవీ చేస్తానని స్పష్టం చేశారు.