ప్రభాస్ ఇతర హీరోలతో ఎంత క్లోజ్ గా ఉంటారో నిన్న జరిగిన సంఘటనతో అందరికీ అర్ధమైంది. యువ హీరో శర్వానంద్ ని తన సొంత తమ్ముడిగా అభివర్ణించారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానుభావుడు’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాస్ మాట్లాడుతూ “శర్వానంద్ మా ఇంటి హీరో. కాబోయే సూపర్ స్టార్ శర్వానంద్’’ అని చెప్పారు. ‘‘యువీ క్రియేషన్స్ నిర్మించిన ‘రన్‌రాజా రన్’లో నటించాడు శర్వా. పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రంలో నటించడం అదే తొలిసారి. ఈపాత్రకు శర్వా సరిపోతాడా? అనే అనుమానం వచ్చింది.
అయితే నిర్మాతలు మాత్రం ‘ట్రై చేసి చూడండి.. మిగిలిన సంగతి తరవాత చూద్దాం’ అన్నారు. ఆ సినిమాలో శర్వా నటన చూసి అభిమాని అయిపోయా. ఆ రోజు నుంచి సొంత తమ్ముడిలా మారిపోయాడు.” అని ప్రభాస్ చెప్పడంతో హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగింది. ఇంకా డైరక్టర్ గురించి మాట్లాడుతూ “నవ్వించడం అంత తేలికైన విషయం కాదు. మారుతి తెరకెక్కించిన ‘ప్రేమకథా చిత్రమ్’ చూసి పడీ పడీ నవ్వుకొన్నా. ‘భలే భలే మగాడివోయ్’ కూడా బాగా నచ్చింది. ఈ మూవీ ఆ రెండు సినిమాల్ని మించిన విజయం అందుకోవాలి” అని ఆకాంక్షించారు. యు.వీ ప్రొడక్షన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు నిర్మించిన మహానుభావుడు ఈనెల 29 న రిలీజ్ కానుంది.