తొలి సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రభాస్ ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. వర్షం, చత్రపతి, మిస్టర్ ఫర్ఫెక్ట్, మిర్చి వంటి సినిమాలతో విజయాలను అందుకున్నా గర్వం అతని కాలర్ కూడా దాటలేదు. అదే సింప్లిసిటీ. అదే పలకరింపు. బాహుబలితో ప్రపంచ స్థాయికి ఎదిగినా అభిమానులకు అందుబాటులోనే ఉన్నారు. పెద్ద స్టార్ హీరో అయిపోయానని ఫోజులు కొట్టకుండా ఇంటికి వచ్చిన అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఆడియో వేడుకల్లో కూడా పరిమితంగా మాట్లాడి డార్లింగ్ అనిపించుకున్నారు.
దర్శకులతో వినయంగా ఉండడం ప్రభాస్ కి మొదటి నుంచి అలవాటు. బాహుబలి (ది బిగినింగ్) చిత్రం షూటింగ్ సమయంలో ఎస్.ఎస్. రాజమౌళితో రెబల్ స్టార్ ఏ విధంగా మెలిగారో ఇప్పుడు కూడా అదే గౌరవం ఇస్తున్నారు. డైరక్టర్ కోరుకున్నట్లుగా.. అనుకునే విధంగా నటించడానికి నూరు శాతం కష్టపడుతారు.
ప్రస్తుతం బాహుబలి – ది కంక్లూజన్ క్లైమాక్స్ షూటింగ్ కోసం హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఎస్.ఎస్. రాజమౌళి సూచనలు తప్పకుండా పాటిస్తూ .. సినిమా అభిమానుల అంచనాలకు తగ్గకుండా రావాలని ప్రభాస్ స్వేదం చిందిస్తున్నారు.