సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో చిత్రం రీసెంట్ గా అబుదాబిలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో చిత్రీకరణ జరుపుకున్న ఈ షెడ్యూల్ కి దాదాపు 70 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ షూటింగ్ లో ప్రభాస్, శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముకేష్, చుంకే పాండే, జాకీష్రాఫ్, మహేష్ మంజ్రేకర్, మందిర బేడీ తో ఎవ్లిన్ శర్మ కూడా పాల్గొన్నారు. ఆమె ఆ షూటింగ్ అనుభవాలను రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు. “అబుదాబి షెడ్యూల్ మరిచిపోలేనిది. అటువంటి భారీ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొనడం ఇదే తొలిసారి” అని ఎవ్లిన్ శర్మ వివరించారు. ఇంకా ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ ఒక జెంటిల్ మ్యాన్ అని చెప్పారు. “ప్రభాస్ ఒక సూపర్ స్టార్. అయినా అతనిలో గర్వం అసలు కొంచెం కూడా కనిపించదు.
కొంచెం పరిచయం ఏర్పడితే ఆయన ఎలాంటి మొహమాటం, బిడియం లేకుండా మాట్లాడుతారు. ఆయనతో వర్క్ చేయడం చాలా గొప్పగా ఉంది” అని బాలీవుడ్ బ్యూటీ ప్రశంసలు గుప్పించారు. యువీ క్రియేషన్స్ బ్యానర్లో, టీ సిరీస్ తో కలిసి వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ సినిమా ఏకకాలంలో తెలుగు, తమిళం, హిందీ భాషలో రూపుదిద్దుకుంటోంది. జాతీయ స్థాయిలో మంచి పేరున్న బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.