బాహుబలి కంక్లూజన్ తర్వాత తాను చేయనున్న సినిమాపై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు. జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణకు ప్రభాస్ డేట్స్ కేటాయించినట్లు, యుద్ధ సన్నివేశాలతో విసిగి పోయిన ప్రభాస్ పూర్తి రొమాంటిక్ పాత్ర చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడని, రాధాకృష్ణ చెప్పిన కథలో కొత్తదనం ఉండడంతో ఆయనకే ఒకే చెప్పినట్లు వచ్చిన రూమర్లకు ఆయన చెక్ పెట్టారు. మూడేళ్ళ క్రితం తాను మాటిచ్చిన సుజీత్ తోనే తర్వాత మూవీ చేస్తానని స్పష్టం చేశారు.
ప్రస్తుతం బాహుబలి 2 క్లైమాక్స్ షూటింగ్ లో ప్రభాస్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ డిసెంబర్ నాటికి పూర్తి అవుతుంది. అనంతరం ఒక నెల రెస్ట్ తీసుకుని ఫిబ్రవరి నుంచి సుజిత్ దర్శకత్వంలో నటించనున్నట్లు యంగ్ రెబల్ స్టార్ వెల్లడించారు. థ్రిల్లర్ జాన్రాలో తెరకెక్కనున్న ఈ మూవీలో అమీ జాక్సన్ హీరోయిన్ గా ఖరారు చేశారు. ఆ తర్వాత రాధాకృష్ణ ఫిల్మ్ చర్చల్లో పాల్గొంటానని తెలిపారు. వీరిద్దరి సినిమాలకు మాత్రమే ఓకే చెప్పానని, ఇప్పట్లో మరో సినిమా గురించి ఆలోచన లేదని కూడా ప్రభాస్ వెల్లడించారు. ఈ రెండు చిత్రాలను “మిర్చి”ని తీసిన యువీ క్రియేషన్స్ వాళ్లే నిర్మించనున్నారు.