యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి చాలా కాలం తర్వాత విశ్రాంతి దొరికింది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో బాహుబలి కంక్లూజన్ క్లైమాక్స్ ఫైట్ కోసం అతను గత 11 వారాలుగా శ్రమించారు. షూటింగ్ తో పాటు బాడీ రూపు చెక్కు చెదరకుండా ఉండేందుకు వ్యాయామం కోసం ఎక్కువ సమయం కేటాయించేవారు. ఇలా రోజుకి ప్రభాస్ 17 గంటల పాటలు పని చేసేవారు. క్లైమాక్స్ షెడ్యూల్ ఆగస్టు 30 నాటికి పూర్తి కావడంతో దర్శకేంద్రుడు ఎస్.ఎస్. రాజమౌళి వారం రోజుల పాటు చిత్ర యూనిట్ కి సెలవు ప్రకటించారు.
వాస్తవానికి క్లైమాక్స్ షెడ్యూల్ ఆగస్టు 28 కే పూర్తి కావాలి. కానీ ఆ రోజు వర్షం కారణంగా షూటింగ్ స్పాట్ మొత్తం వాన నీటితో నిండి పోయింది. దీంతో ఆరోజు మొత్తం చిత్ర బృందం క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. తర్వాత వాన తగ్గుముఖం పట్టడంతో 30న మిగిలిన షాట్స్ పూర్తి చేసి షెడ్యూల్ ప్యాకప్ చెప్పారు. “బాహుబలి 2 క్లైమాక్స్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. దీంతో సెప్టెంబర్ 6 వరకు చిత్ర యూనిట్ కి బ్రేక్ ఇస్తున్నాం” అని చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తర్వాతి షెడ్యూల్ ల్లో ప్రభాస్, రానాలతో పాటు అనుష్క, సత్యరాజ్ పాల్గొననున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాల్సి వచ్చిందో ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. ఈ షూటింగ్ లో అతి కొద్దీ మంది మాత్రమే పాల్గొంటారని సమాచారం.