కేరళ కుట్టికి కోపం వచ్చింది. తెలుగు, తమిళ్, కన్నడ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్న ప్రియమణి నెటిజన్ల పై విరుచుకు పడింది. ఈ ఆగ్రహానికి కారణం వెనుక ఉన్న విషయంలోకి వెళితే .. ఎవరే అతగాడు ? అంటూ టాలీవుడ్ లోకి ప్రవేశించిన ఈ భామ .. పరిశ్రమను విడిచి వెళ్ళేలోపు తన మనసు గెలిచిన అతగాడిని పట్టుకుంది. పట్టుకున్న చేతిని వదల కూడదని ప్రియుడు ముస్తుఫా రాజ్ ను పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకుంది. వీరిద్దరూ తమ కుటుంబసభ్యులను ఒప్పించి.. వారి అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ వేడుకను ఫోటోలలో బంధించి తన అభిమానులతో పంచుకునేందుకు ప్రియమణి వాటిని సోషల్ మీడియా సైట్లలో పెట్టింది. ఆమె ఒకటి తలిస్తే .. నెటిజన్లు మరొకటి తలిచారు. ఆ ఫోటోలపై కొంతమంది అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
ప్రియమణి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ముస్లిం కావటంతో వారి ప్రేమను లవ్ జిహాద్ తో పోలుస్తూ కొంతమంది కామెంట్లు పెట్టారు. నిశ్చితార్థం అయిన కొత్తల్లో ఇలా జరిగిందేమిటని బాధపడింది. నెగటివ్ కామెంట్లు ఆగగ పోయే సరికి ఆమె స్పందించింది. ‘ఛీ .. మీరు మారరా? నేను జీవితంలో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నాని, నాకు మీ శుభాకాంక్షలు, ఆశీర్వాదం కావాలని కోరితే ఇలాగేనేనా స్పందించేది. మీ మాటలకు నాకు చికాకు పుడుతోంది. మీ సందేశాలతో మమ్మల్ని దీవించండి. అంతే తప్ప ఇలా బాధపెట్టకండి. ఇప్పటికైనా మారండి.’. అంటూ ప్రియమణి పోస్ట్ చేసింది. ఇలా నెగటివ్ కామెంట్లకు ఫుల్ స్టాప్ పెట్టింది.