తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ తో గుర్తింపు తెచ్చుకున్ననటుడు రాహుల్ రామకృష్ణ. ప్రస్తుతం తన ఇంట జరిగిన వ్యక్తిగత విషాదంతో వార్తల్లో నిలిచారు. కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఈ సమయంలోనే ఆయన కుటుంబంలో చోటుచేసుకున్న విషాద ఘటన అందరినీ కలచివేసింది. తన సోదరుడిని కోల్పోయిన రాహుల్, ఈ బాధను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
తన సోదరుడి మరణానికి కారణం ‘పారాక్వైట్’ అనే ప్రమాదకర రసాయనం అని వెల్లడించిన ఆయన, ఈ విషయం సమాజానికి ఒక హెచ్చరికగా మారాలని కోరుకున్నారు. అత్యంత విషపూరితమైన ఈ రసాయనం సులభంగా అందుబాటులో ఉండటం వల్ల అనేక ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఇది దుర్వినియోగానికి గురవుతూ, తీవ్ర పరిణామాలకు దారి తీస్తోందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన తన ట్విట్టర్ వేదికగా, రాష్ట్ర ముఖ్యమంత్రిని & దేశ ప్రధానమంత్రిని , ఈ రసాయనాన్ని వెంటనే నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఇలాంటి పదార్థాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యక్తిగత విషాదాన్ని సామాజిక సమస్యగా ప్రస్తావించిన ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు విస్తృత చర్చకు దారితీశాయి.
సినీ అభిమానులు, సహనటులు ఆయనకు మద్దతుగా నిలుస్తూ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా, తన ప్రొఫెషనల్ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న రాహుల్, ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ, ఈ సంఘటన ఆయన జీవితంలో మర్చిపోలేని గాయంగా మిగిలిపోనుందనే చెప్పాలి.