నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం “మజ్ను” గురించి ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. విరంచి వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆనందీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై జెమినీ కిరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో యువ హీరో రాజ్ తరుణ్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇది వరకు ఈడో రకం, ఆడో రకం సినిమాలో మంచు విష్ణు తో కలిసి రాజ్ తరుణ్ నటించాడు.
సింగిల్ గా హ్యాట్రిక్ విజయాలు అందుకున్నా మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించడానికి ఎటువంటి ఇబ్బంది లేదని ఈ చిత్రంతో క్రేజీ హీరో స్పష్టం చేసాడు. ఇప్పుడు ఉయ్యాలా జంపాల సినిమాతో పరిశ్రమకు హీరోగా పరిచయం చేసిన విరంచి వర్మ కోరడంతో రాజ్ సంతోషంగా ఒప్పుకున్నట్లు తెలిసింది. మజ్ను క్లైమాక్స్ లో రాజ్ తరుణ్ ఎంట్రీ ఉంటుందని, అతను కొంత సేపే కనిపించినా ప్రేక్షకులు పగలబడి నవ్వుతారని ఫిలిం నగర్ వర్గాల టాక్. రాజ్ తరుణ్ ప్రస్తుతం సంజనా రెడ్డి దర్శకత్వంలో ‘రాజుగాడు’ అనే సినిమాలో నటిస్తున్నాడు.