బాహుబలి సినిమాల తర్వాత దర్శకధీరుడు రాజమౌళి చేస్తున్న #RRRపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆయన తొలి సారి మల్టీ స్టారర్ మూవీ చేయడం.. అది కూడా నందమూరి, మెగా హీరోలు కలిసి నటిస్తుండడంతో సూపర్ క్రేజ్ వచ్చింది. ఈ సినిమా కూడా హాలీవుడ్ టెక్నీషియన్లు ఎక్కువమంది పనిచేయనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం నగర శివార్లలో భారీ సెట్స్ వేస్తున్నారు. అలాగే రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్స్ వేస్తున్నారు. ఈ సెట్స్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. అందుకే ఆ పనుల నుంచి బయటికి వచ్చి మ్యూజిక్ పనులను మొదలు పెట్టారు. తన ఆస్థాన సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణితో మ్యూజిక్ సిట్టింగ్ ప్రారంభించారు. పాటలతో పాటు.. సినిమాలో థీమ్ మ్యూజిక్ ముందుగా కంప్లీట్ చేయనున్నట్టు తెలిసింది.
రాజమౌళి సినిమాల్లో సెంటిమెంట్ థీమ్ మ్యూజిక్ ఒకటి గుండెల్ని పిండేస్తూ ఉంటుంది. అది కంప్లీట్ అయితే అందుకు తగ్గట్టు ముందు నుంచే షాట్స్ తీయనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఒక నెల పాటు కుటుంబ సభ్యులతో కలిసి విశ్రాంతి తీసుకోనున్నారు. ఇక రామ్ చరణ్ బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ మూవీ నవంబర్ చివరి నాటికీ షూటింగ్ కంప్లీట్ చేసుకోనుంది. దీంతో ఇద్దరూ డిసెంబర్ నుంచి షూటింగ్ లో పాల్గొననున్నారు. అప్పటిలోపున ట్యూన్స్ ని కంప్లీట్ చేయాలనీ రాజమౌళి భావిస్తున్నారు.