ఒక మనసు చిత్రం తర్వాత మెగా డాటర్ నిహారిక చేసిన సినిమా “హ్యాపీ వెడ్డింగ్”. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్ హీరోగా నటించాడు. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటోంది. పాటలు కూడా మనసుకు తాకుతున్నాయి. యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఈనెల 28న థియేటర్లోకి రానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక వేడుక హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వేదికపై పలు ఆసక్తికర సంగతులు చెప్పారు. “నిహారిక కోసం నేను ఈ ఫంక్షన్ కు రాలేదు. ఎమ్మెస్ రాజు గారి కోసం వచ్చాను.
గతం(1980 )లో ఒకసారి ఇంట్లో డబ్బు లేకపోతే నాన్న చాలా మందిని అడిగారట… ఎవరూ సహాయం చేయకపోతే, ఎమ్మెస్ రాజుగారు 5 వేలు ఇచ్చి ఆదుకున్నారట… ఈ మధ్యనే నాన్న ఈ విషయాన్ని మా వద్ద గుర్తు చేసుకున్నారు. అలాంటి ఎమ్మెస్ రాజు గారు ఫంక్షన్ కి రమ్మని అడిగితే, రెండో విషయం ఆలోచించకుండా వచ్చేశాను ” అని చరణ్ చెప్పడంతో ఆహుతులు ఆశ్చర్యపోయారు. అనంతరం నిహారికా మాట్లాడుతూ.. ” సెట్లో యూనిట్ అంతా నన్ను గాజు బొమ్మలా చూసుకున్నారు. డైరక్టర్ లక్ష్మణ్ గారు అమ్మాయి మనసులోని ఎమోషన్స్ ను అద్భుతంగా చూపించారు. షూటింగ్ లో నిజంగానే పెళ్లి వాతావరణం కనిపించింది” అని వెల్లడించింది.