రంగస్థలం మూవీ తర్వాత రామ్ చరణ్ తేజ్ మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని చెర్రీ లేకుండా కంప్లీట్ చేశారు. రెండో షెడ్యూల్ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో ప్రారంభమయింది. ఇందులో చరణ్ పై యాక్షన్ సీన్ పూర్తి చేశారు. తమిళ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కనల్ కన్నన్ నేతృత్వంలో ఈ ఫైట్ చిత్రీకరించారు. బోయపాటి బృందం నెక్స్ట్ షెడ్యూల్ ని బ్యాంకాక్ లో ప్లాన్ చేసింది. 20 రోజుల పాటు కొనసాగే ఈ షెడ్యూల్లో రామ్ చరణ్, కైరా అద్వానీలపై రొమాంటిక్ సన్నివేశాలు, ఒక పాటని చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన చరణ్ విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం ఇచ్చారు.
ఇరవై రోజులపాటు షెడ్యూల్ కాబట్టి మీ భార్య ఉపాసనను తీసుకెళుతున్నారా?.. అంటే అందుకు చెర్రీ.. “ఉపాసనకు నాతో రావాలనే ఉంది. కానీ ఆమెకు వ్యాపార సంబంధ కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. వాటిని ఈ గ్యాప్ లో పూర్తి చేయనుంది” అని వివరించారు. ఈ సినిమాలో కైరాని నమ్రత సలహా మేరకే తీసుకున్నారని ప్రచారం సాగుతుంది.. దానిపై మీరేమంటారు? అని అడగగా.. ఆ వార్తలు అవాస్తవమని చెప్పారు. “మా కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉన్నమాట వాస్తమే. అది వ్యక్తిగతమే. వృత్తిలో ఇన్వాల్వెమెంట్ ఉండదు. ఇక నేను ఏ చిత్రంలోనైనా హీరోయిన్ విషయాన్నీ దర్శకనిర్మాతలకే వదిలేస్తాను. ఎవరితోనైనా సౌకర్యవంతంగానే నటిస్తాను” అని స్పష్టం చేశారు. ఇక సినిమా కథ గురించి బయటపెట్టడానికి నిరాకరించారు. రంగస్థలం సినిమాకి పూర్తి అపోజిట్ గా ఉంటుందని మాత్రం చరణ్ వెల్లడించారు.