‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం తర్వాత హీరోగా రానా మరే తెలుగు చిత్రం చేయలేదు. అయితే తమిళ .. హిందీ భాషల్లో మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా హిందీ చిత్రాలయితే ముందుంటున్నాడు. బాలీవుడ్ లో కూడా రానా కి క్రేజ్ ఉండడంతో తనకి ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. అందులోనూ అక్కడ సినిమాల స్క్రిప్ట్ పక్కాగా రెడీ చేసుకుంటారు… షూటింగ్ కూడా త్వరగా పూర్తిచేస్తారు. అంతే కాదు పెద్ద మొత్తంలో పారితోషికాన్ని కూడా ఇస్తారు. అందుకే రానా బాలీవుడ్ చిత్రాల్లో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటాడని తెలుస్తుంది. ఇక ఇటీవల రానా ‘హౌస్ ఫుల్ 4’ చిత్రంలో నటించాడు. ఇప్పుడు మరో భారీ బడ్జెట్ చిత్రంలో కూడా నటించడానికి రానా రెడీ అయ్యాడని సమాచారం.
ప్రతిష్టాత్మకంగా తెరెక్కుతున్న ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ చిత్రంలో రానా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడట. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రానా .. కల్నల్ గా కనిపించబోతున్నాడట. 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తుండగా, సంజయ్ దత్ .. సోనాక్షి సిన్హా .. పరిణీతి చోప్రా ప్రత్యేక పాత్రలను పోషిస్తున్నారట. అభిషేక్ దుదానియా దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంతో రానా క్రేజ్ మరింత పెరగడం ఖాయమని బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం.