తెరమీద మెరుపు వేగంతో కదిలే రవితేజ సినిమాల ఎంపికలో మాత్రం ‘నిదానమే ప్రధానం’ అన్నట్టు సాగుతున్నాడు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరున్న మాస్ మహారాజ్ రవితేజ కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. మిశ్రమ తెచ్చుకున్న బెంగాల్ టైగర్ ఈ విషయంలో కొంత ఊరటనిచ్చింది. అయినా రవితేజ వేగంలో మార్పు లేదు. మాస్ రాజాతో సినిమా చేసేందుకు పలువురు దర్శకుల పేర్లు పరిశీలనకు వచ్చినా అవేవీ కార్యరూపం దాల్చలేదు. తాజాగా రవితేజ సినిమా సంబంధించి అధికారిక కబురొకటి అందింది.
నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మించనున్న ఓ సినిమాలో రవితేజ నటించనున్నారు. వీరిద్దరి కలయికలో వస్తోన్న తొలి సినిమా ఇదే. కాగా శాసన సభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘రేసుగుర్రం’ సినిమాలకు స్క్రీన్ ప్లే రాసిన విక్రమ్ సిరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. వక్కంతం వంశీ ఈ సినిమాకి కథ అందిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో కిక్, కిక్ 2 సినిమాలు రాగా రెండో భాగం ప్లాప్ గా మిగిలింది. ఇవన్నీ ఎలా వున్నా రవితేజ కొత్త సినిమా మొదలైందన్నది అసలు విషయం.