Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సందీప్ అశ్వ (Hero)
  • సాన్య ఠాకూర్ (Heroine)
  • అనీష్ కురివెళ్ల, రాజీవ్ కనకాల,జోయా జావేరి, కాదంబరి కిరణ్,దువ్వాసి మోహన్ తదితరులు (Cast)
  • ఘంటాడి కృష్ణ (Director)
  • రావి సురేష్ రెడ్డి, గుర్రం నరసింహులు, ఘంటాడి కృష్ణ (Producer)
  • ఘంటాడి కృష్ణ (Music)
  • జగదీష్ కోమరి (Cinematography)
  • శివ శర్వాణి (Editor)
  • Release Date : 26th జూన్ 2026
  • జికె మిరాకిల్స్ (Banner)

90’s ఆడియన్స్ కి ఘంటాడి కృష్ణ సుపరిచితులే. ఆయన సంగీతంలో వచ్చిన ‘6 టీన్స్’ ‘సంపంగి’ వంటి సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. అయితే తర్వాత ఆయన కొన్నేళ్ళ పాటు గ్యాప్ తీసుకోవడం జరిగింది.తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా ఆశించిన బ్రేక్ రాలేదు. అయితే ఆయన దర్శకుడిగా మారి ‘రిస్క్’ అనే సినిమాని తీశారు. దీనికి ఆయన కూడా ఓ నిర్మాత కావడం విశేషం. మరి ఈ సరికొత్త ప్రయోగం ఆయనకి ఎలాంటి అనుభవం మిగిల్చిందో తెలుసుకుందాం రండి:

Risk Movie Review

కథ: కార్తీక్ (సంగీత్ అశ్వ) ఒక ఐటీ జాబ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తుంటాడు. అక్రమ మార్గాలు తొక్కి యావరేజ్, బిలో-యావరేజ్ స్టూడెంట్స్‌కి ఇన్ఫోసిస్, విప్రో వంటి పెద్ద ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. అలా వినమ్ర (సన్యా ఠాకూర్) అనే అమ్మాయికి కూడా ఉద్యోగం ఇప్పించే వంకతో దగ్గరై, ఆమెను ప్రేమలోకి దించుతాడు. మరోవైపు, అడ్డదారుల్లో తాను సంపాదించిన డబ్బంతా స్నేహితులతో కలిసి జల్సాలు చేయడానికే తగలేస్తుంటాడు. అతని స్నేహితులైన రాహుల్, వెంకట్ కూడా అచ్చం కార్తీక్ లాంటి మనస్తత్వం కలిగిన వారే.అయితే, ఒకరోజు వీరికి సందాలి (జోయా జావేరి) అనే మిస్ ఇండియాతో పరిచయం ఏర్పడుతుంది.

ఆమె అందానికి ఫిదా అయిన ఈ గ్యాంగ్, ఆమెతో ఓ ప్రైవేట్ సాంగ్ చేసే వంకతో మరింత దగ్గరవుతారు. ఒకసారి ఆమెను ఎవరో గుర్తుతెలియని వ్యక్తి చంపడానికి ప్రయత్నించగా, కార్తీక్ అండ్ కో ఆమెను కాపాడతారు. తనను చంపడానికి ప్రయత్నించింది తన భర్త ప్రదీప్ చక్రవర్తి (అనీష్ కురువిల్లా) అని సందాలి వారితో చెప్పి నమ్మిస్తుంది. ఎలాగైనా తన భర్తను చంపి తనను కాపాడాలని కార్తీక్, అతని స్నేహితులను కోరుతుంది.సందాలి మాటలు నమ్మిన కార్తీక్ గ్యాంగ్.. ఆమె కోరినట్లుగానే ప్రదీప్ చక్రవర్తిని చంపేందుకు వెళ్తారు. కానీ ఊహించని విధంగా సందాలినే పోలీసులను తీసుకొచ్చి, కార్తీక్ తో పాటు అతని స్నేహితులను కూడా పోలీసులకు పట్టిస్తుంది.ఆ తర్వాత వాళ్ల జీవితం ఏమైంది? సందాలి వారిని ఎందుకు ఇరికించింది? అసలు ప్రదీప్ చక్రవర్తి ఎవరు? ఈ కేసును డీల్ చేస్తున్న ఎంకౌంటర్ స్పెషలిస్ట్ రాజీవ్ పరమహంస (రాజీవ్ కనకాల) బారి నుండి కార్తీక్ అండ్ గ్యాంగ్ ఎలా బయటపడ్డారు? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: హీరో సందీప్ అశ్వ లుక్స్ అయితే బాగున్నాయి. డాన్సులు, ఫైట్లు బాగానే చేశాడు. కానీ యాక్టింగ్ తో మెప్పించలేకపోయాడు. అతని ఫ్రెండ్స్ గా చేసిన వారు కూడా తేలిపోయారు. రాజీవ్ కనకాల ఆల్మోస్ట్ సెకండాఫ్ కి హీరో అనుకోవాలి. తన విలక్షణ నటనతో మంచి మార్కులు వేయించుకుంటాడు. అనీష్ కురివెళ్ల ఎప్పటిలానే సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. కాదంబరి పాత్ర గెస్ట్ రోల్ ను తలపిస్తుంది. దువ్వాసి మోహన్ ఓకే. హీరోయిన్ సానియా లుక్స్ బాగున్నాయి. జోయా జావేరి గ్లామర్ షో ఆకట్టుకోదు. మిగతా నటీనటుల పాత్రలు ఏమీ రిజిస్టర్ కావు అనే చెప్పాలి.

సాంకేతిక నిపుణుల పనితీరు: మొదట ఈ ప్రాజెక్టును ‘6 టీన్స్-2’గా ప్రకటించారు. 2001లో వచ్చిన ‘6 టీన్స్’ సినిమా సాధించిన విజయం, ఆ సినిమాపై ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని దర్శకుడు, నిర్మాతల్లో ఒకరైన ఘంటాడి కృష్ణ ప్రయత్నించారు. కానీ తర్వాత ఏమైందో ఏమో మనసు మార్చుకుని దీనికి ‘రిస్క్’ అనే టైటిల్‌ పెట్టారు. టైటిల్‌కు తగ్గట్టుగానే.. థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులకు ఇది ఒక రకంగా పెద్ద ‘రిస్క్’ అనే చెప్పాలి.ఘంటాడి కృష్ణ ఇంకా 2001 కాలంలోనే ఉండిపోయారని, ఏమాత్రం అప్‌డేట్ అవ్వలేదని సినిమాలోని ప్రతి ఫ్రేమ్ చెబుతుంది. సినిమాలో హీరో ఐటీ కన్సల్టెంట్ అయినప్పటికీ, ఇన్ఫోసిస్ వంటి బడా కంపెనీల్లో బిలో యావరేజ్ స్టూడెంట్స్‌కు ఉద్యోగాలు ఎలా ఇప్పించగలుగుతాడో అర్థం కాదు.

ప్రతి సినిమాలోనూ లాజిక్ లోపాలు ఉండటం సహజమే, కానీ మినిమమ్ లాజిక్స్ కూడా లేకపోతే రియాలిటీ మిస్ అవుతుంది. అప్పుడు యూత్ కూడా సినిమాతో ఎలా రిలేట్ అవుతారు చెప్పండి? కథ, కథనాల సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాలో కనీస స్థాయి నిర్మాణ విలువలు కూడా లేవంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ఫైట్స్‌లో వాడిన కత్తులు, అవి కనిపిస్తున్న తీరు చూస్తుంటే పేపర్ కత్తులు వాడారా అనిపిస్తుంది. ఆడియన్స్ ని ఇంత ‘టేక్ ఇట్ గ్రాంటెడ్’గా తీసుకుంటే ఎలా? చివరాఖరికి ‘6 టీన్స్’ సినిమా హిట్ అవ్వడానికి కారణమైన ‘దేవుడు వరమందిస్తే’ పాటని కూడా ఇందులో రీమిక్స్ చేశారు. అది కూడా వర్కౌట్ అవ్వలేదు.

విశ్లేషణ: లాజిక్ లేని కథనం, అత్యంత నాసిరకమైన నిర్మాణ విలువలు, మినిమమ్ క్వాలిటీ లేని మ్యూజిక్ వంటి వాటితో ఘంటాడి కృష్ణ చేసిన ఓ వృధా ప్రయత్నంగా ఈ ‘రిస్క్’ మిగిలిపోతుంది.

ఫోకస్ పాయింట్: థియేటర్..కి వెళ్తే ‘రిస్క్’ చూ(చే)సినట్టే..!

రేటింగ్: 1/5

Rating

1
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus