గత కొన్ని రోజులగా చిరంజీవి అనే పేరు ఎత్తగానే వినిపించే రూమర్.. అయితే ‘మెగావెర్స్’, లేదంటే ‘ఏ సినిమా ముందు రిలీజ్’. అంతలా ఈ రెండు టాపిక్‌లు చర్చలో నిలుస్తూ వచ్చాయి. అయితే, తొలిసారి ఈ రెండు అంశాలు కాకుండా మరో పాయింట్ చర్చలోకి వచ్చింది. అదే ‘కాకా’. మళ్లీ రిలీజ్ డేట్ రూమరేనా? అని అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన టాపిక్ సినిమాలోని పాట గురించి. అదేనండీ ఐటమ్ పాట గురించి.
ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్ ఉండటం అనేది మినిమమ్ థింగ్ అయిపోయింది. ఎలా అయినా, ఓ స్పెషల్ సాంగ్ పెట్టి.. అందులో ఓ అందాల భామను పెట్టి.. కాస్త ఒయ్యారాలు దట్టించి.. మాస్ పల్స్‌ను కూల్ చేద్దామని దర్శకులు ప్లాన్ చేస్తున్నారు. అలా ఇప్పుడు కూడా కేఎస్ రవీంద్ర (బాబి) అదే పని చేశారట. సినిమా కోసం తమన్ ఓ మాస్ నెంబరు సిద్ధం చేశారని.. దానికి చిరంజీవితో కలసి యువ కథానాయిక, ‘గురు’ సినిమా ఫేమ్ రితికా సింగ్ స్టెప్పులేసిందట.
హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రూపొందిన సెట్‌లో ఈ పాట చిత్రీకరణ పూర్తయిందని తెలుస్తోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ పాటకు నృత్య రీతులను సమకూర్చారట. చిరంజీవి హీరోగా, బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కాకా’. వీరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ విజయం అందుకుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
తండ్రీకూతుళ్ల భావోద్వేగాలకు, మాస్ – యాక్షన్ అంశాలను జోడించి ఈ కథను సిద్ధం చేశారు. ఇందులో చిరంజీవి రెండు భిన్న కోణాలు ఉన్న పాత్రలో కనిపిస్తారు. అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ ఇతర ముఖ్య పాత్రధారులు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 1 నుండి ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.