సౌత్ సినిమా పరిశ్రమలో ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది మ్యూజిక్ అంటే సాయి అభ్యంకర్ అని చెప్పాలి. గత కొన్ని నెలలుగా ఈ మ్యూజిక్ సెన్సేషన్ గురించి వార్తలు వస్తున్నా, ప్రత్యేకతల గురించి చెబుతున్నా.. ఇప్పుడెందుకో బాగా వైరల్ అయిపోతున్నాడు ఈ 21 ఏళ్ల కుర్రాడు. ప్రముఖ గాయనీగాయకులు టిప్పు – హరిణి తనయుడిగా పరిశ్రమకు ఇప్పటికే పరిచయం ఉన్న సాయి అభ్యంకర్ ఇప్పుడు వరుసగా పెద్ద సినిమాలు చేస్తూ బిజీ అవుతున్నాడు.
ఈ క్రమంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. తాను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు ఓసారి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి.. నా చదువు మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకండి అని అన్నాడట. ఆ డబ్బులతో తనకు మ్యూజికల్ ఎక్విప్‌మెంట్స్ కొని ఇవ్వమని అడిగాడట. వాళ్లు కూడా అలానే చేశారు. దీంతో చిన్నతనంలోనే ప్రొఫెషనల్ లెవల్ మ్యూజికల్ ఎక్విప్‌మెంట్‌తో సంగీతం నేర్చుకున్నాడు.
ఇండిపెండెంట్ సాంగ్స్‌తో ఫేమస్ అయిన సాయి అభ్యంకర్.. సినిమా పాటలకు, వాటికీ సమ ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. సాయి సంగీతం బాగుంది అని చెబితే చాలని.. ఏదో కొత్త రకం మ్యూజిక్ క్రియేట్ చేసేస్తున్నాడనే పేరు అక్కర్లేదని చెప్పాడు. నా స్టూడియోలో నేను మ్యూజిక్ చేస్తా.. దానిని శ్రోతలు విని ఎంజాయ్ చేస్తున్నారు అది నాకు చాలు అని అంటున్నాడు.
ఆరో తరగతి చదువుతున్న రోజుల్లో తండ్రి స్టూడియోకి వెళ్లడం సాయికి అలవాటైందట. అక్కడ టిప్పు సాయి కోసం ప్రత్యేకమైన స్పేస్ క్రియేట్ చేసి మరీ ఇచ్చారట. అక్కడే మ్యూజిక్ జర్నీ స్టార్ట్ అయిందట. ఇక సంగీత దర్శకుడిగా ప్రయాణం స్టార్ట్ చేసిన కొత్తల్లో వారానికోసారి ఏఆర్ రెహ్మాన్‌కు తన కంపోజిషన్లు మెయిల్ చేసేవాడిని. ఒక్కోసారి ఎన్ని పంపేవాడినో కూడా లెక్క లేదు అని చెప్పాడు సాయి అభ్యంకర్.
ప్రస్తుతం అభ్యంకర్ చేతిలో సూర్య ‘కరుప్పు’, లారెన్స్ ‘బెంజ్’, కార్తి ‘మార్షల్’, అల్లు అర్జున్ – అట్లీ సినిమా, ధనుష్ – రాజ్‌కుమార్ పెరియస్వామి సినిమాలు ఉన్నాయి. ఇక గతేడాది ‘బాల్టీ’, ‘డ్యూడ్’ సినిమాలు చేశాడు.