కమర్షియల్ సినిమా ప్రపంచంలో సాయి పల్లవి రూటే వేరు. సహజత్వానికి దగ్గరగా ఉండే కథలను ఎంచుకొని అందులో అంతే సహజంగా నటించి వరుసగా విజయాలను అందుకుంటోంది. స్కిన్ షోకి దూరంగా ఉంటూ అభినయంతో అభిమానులను సంపాదించుకుంది. మలయాళంలో ప్రేమమ్ తో హిట్ కొట్టగా.. తెలుగులో ఫిదా తో మంచి మార్కులు పట్టేసింది. ఎంసీఏ లోను అలరించింది. ఇప్పుడు తమిళంలో ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతోంది. కణం(కరు) ద్వారా ఎంట్రీ ఇస్తోంది. ఇది కూడా తల్లి కూతుళ్ళ అనుబంధంతో తెరకెక్కిన సినిమా. ఇవే కాకుండా ఆమె ప్రస్తుతం తెలుగులో శర్వానంద్ సరసనా, తమిళంలో సూర్య, ధనుష్ సినిమాల్లోనూ హీరోయిన్గా నటిస్తోంది.
తాజాగా ఆమె తమిళంలో మరో విభిన్నమైన సినిమాను అంగీకరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నటుడు కె.భాగ్యరాజ్ తనయుడు శంతను భాగ్యరాజ్ నటుడిగా తండ్రికి తగ్గ తనయుడిని నిరూపించుకున్నారు. అలాగే డైరక్టర్ గా సత్త చాటేందుకు అద్భుతమైన కథను రెడీ చేశారు. అందులో ముఖ్యమైన పాత్రలకు నిత్యామీనన్, సాయి పల్లవిలను సెలక్ట్ చేశారు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి దర్శకుడు మిస్కిన్ ఉత్సాహంగా ఉన్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ కథ గురించి ఓ విషయం తెలిసింది. హారర్ నేపథ్యమే అయినా ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉందని సమాచారం. అసలు ఎక్స్ పోజిగ్ కి దూరంగా ఉండే సాయి పల్లవి ఈ కథకు ఎలా ఓకే చెప్పిందని అందరూ ఆశ్చర్యపోతున్నారు.