ఏ మాయ చేసావే సినిమా నుంచి.. రీసెంట్ గా వచ్చిన రంగస్థలం సినిమా వరకు సమంత తనకి ఇచ్చిన పాత్రలకు ప్రాణం పోసింది. సమంత కంటే ఆమె పోషించిన పాత్రలే అందరి మనసులో స్థానం సంపాదించుకున్నాయి. ఇప్పుడు చైతూతో కలిసి మజిలీ సినిమా చేస్తోంది. ఈ సందర్భంగా తాను చేసిన పాత్రల గురించి.. ఆ పాత్రల నుంచి నేర్చుకున్న పాఠాల గురించి వివరించింది. “నటులపై ఏ పాత్ర ఎంత కాలం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అస్సలు ఊహించలేం. ఈ ఒక్క సినిమాని, ఈ ఒక్క పాత్రని ఎలాగోలా కానిచ్చేద్దామని ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు. వ్యక్తిగతంగా ప్రతి పాత్ర నాకు అమూల్యమైందే. ‘ఏమాయ చేసావె’లోని జెస్సీ పాత్ర నా నట ప్రయాణాన్నీ మార్చేసింది. తొలి సినిమాతోనే నటిగా గుర్తింపు లభించిందంటే ఆ పాత్రే కారణం.
ఆ సినిమా తర్వాత సమంత అంటే బలమైన పాత్రనే సృష్టించాలనే కోణంలో ఆలోచించారు దర్శకులు. అందుకే ఆ తర్వాత కూడా నాకు సరిపోయే పాత్రలు లభించాయి. ఒక పాత్ర నటుల జీవితాన్నే మలుపు తిప్పుతుందనే మాట అలా తొలి చిత్రంతోనే అనుభవమైంది. అందుకే అప్పట్నుంచి ప్రతి సినిమా విషయంలోనూ మరింత బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టా. ఆ జాగ్రత్తే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. ఆ రకంగా చూస్తే తొలి సినిమా తాలూకు ప్రభావం ఇప్పుడు కూడా నాపై ఉన్నట్టే కదా’’ అని సమంత చెప్పింది. పెళ్లి తర్వాత కూడా మరింత మంచి పాత్రలు సమంత సొంతం కావడం వెనుక ఆమె డెడికేషన్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.