Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

తెలుగు నిర్మాతలు పక్క రాష్ట్రాలకు వెళ్లి సినిమాలు నిర్మించడం చాలా తక్కువ. అందులో వరుస సినిమాలు చేయడం అయితే చాలా అరుదు. ఇలాంటి అరుదైన పనులు చేస్తున్న నిర్మాత నాగవంశీ. ఆయనకు చెందిన సితార ఎంట‌ర్టైన్‌మెంట్స్ సంస్థ చిన్న‌, మీడియం, పెద్ద రేంజి హీరోలతో సినిమాలు చేస్తోంది. తెలుగులో ఎన్నో ఏళ్లుగా వరుస సినిమాలు చేస్తున్న నాగవంశీ.. ఇప్పుడు తమిళ హీరోలతోనూ వరుస సినిమాలు ఓకే చేసుకుంటున్నారు.

Simbu – Sithara

ఇప్పటికే ధనుష్‌, సూర్యతో సినిమాలు చేసిన నాగవంశీ.. ఇప్పుడు కార్తితో ఓ సినిమా చేస్తున్నారు. త్వరలో శింబుతో ఓ సినిమాను ఓకే చేసుకున్నారు. శింబు ఎప్పటి నుండో తెలుగులో ఓ సినిమా చేయాల‌ని అనుకుంటున్నాడు. ఈ క్రమంలో తెలుగు ద‌ర్శ‌కులు కొంతమంది కథలు కూడా చెప్పారు. అయితే ఎవరూ ఆయనను ఒప్పించలేకపోయారు. ఎట్ట‌కేల‌కు శింబుకి నాగ‌వంశీ ఓ క‌థ‌ని సెట్ చేశారట. అయితే ఆ కథ కోలీవుడ్‌ నుండే వచ్చింది.

‘డ్యూడ్’ సినిమా దర్శకుడు కీర్తిశ్వ‌ర‌న్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. ఈ సినిమా కథ కూడా యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌రే అని సమాచారం. తమిళ దర్శకుడు, తమిళ హీరో చేస్తున్న సినిమా అయినా సరే.. ఈ సినిమాను స్ట్రయిట్‌ తెలుగు సినిమా అనేలానే నిర్మించాలని నాగవంశీ చూస్తున్నారట. లేదంటే ద్విభాషా చిత్రంగా తెరకెక్కించే ఉద్దేశంలో కూడా ఉన్నారట. అయితే గతంలో ఇదే తరహాలో విజయ్‌తో ‘వరిసు’ / ‘వారసుడు’ ఇలానే స్ట్రయిట్‌ తెలుగు సినిమాగానే చెప్పినా.. ఫైనల్‌గా కుదర్లేదు. ఈ నేపథ్యంలో నాగవంశీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

నాగవంశీ తమిళ హీరోలతో నిర్మించిన సినిమాలు చూస్తే.. ధనుష్‌తో ‘సార్‌’, సూర్యతో ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ సినిమాలు చేశారు. ఆ రెండు సినిమాలూ భారీ విజయం దక్కించుకున్నాయి. ఇప్పుడు చేతిలో ఉన్న కార్తి సినిమా, చేయబోతున్న శింబు సినిమా కూడా అదే స్థాయిలో ఫలితం అందుకుంటుందేమో చూడాలి.

‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus