‘విష్ణు విన్యాసం’ అని ఇప్పుడు ఆయన సినిమా చేశాడు కానీ.. గత కొన్నేళ్లుగా విష్ణు ‘వినోద విన్యాసాలు’ చూస్తూనే ఉన్నాం. వరుసగా వినోదాత్మక సినిమాలే చేస్తున్నా ఎక్కడా రిపీట్ ఫీలింగే కలగకుండా అలరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ అనే పేరు సంపాదించుకున్నాడు. దానికి తగ్గట్టుగానే గత కొన్ని సినిమాల్లో అదరగొట్టేస్తున్నాడు. ఒక సినిమా ఫలితం కాస్త ఇబ్బందిపెట్టినా ముందుకు సాగిపోయింది. మరి ఈ ట్యాగ్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా అని అడిగితే.. విష్ణు ఏం చెప్పాడో తెలుసా?
ఎంటర్‌టైన్‌మెంట్ అనగానే కామెడీ మాత్రమే అని అనుకుంటారు కొందరు. దాంతో నా ప్రతి సినిమాలోనూ కామెడీనే ఆశిస్తున్నారు. అందుకే డ్రామా ఉన్న కొత్త కథలు చేసినా, అందులో ప్రేక్షకులు నా నుంచి కోరుకునే వినోదం తప్పక ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను అని చెప్పాడు. కామెడీ టైమింగ్‌లోనూ మార్పు కనిపించేలా చూసుకుంటున్నాను. కావాలంటే మీరే గమనించొచ్చు. ‘సామజవరగమన’ సినిమాలో ఒక టైమింగ్ ఉంటే, ‘సింగిల్’ సినిమాలో మరోలా చూపించాను. ఇక ‘విష్ణు విన్యాసం’లో ఆ రెండు సినిమాలకి భిన్నమైన టైమింగ్ చూపించే ప్రయత్నం చేశాను అని చెప్పాడు శ్రీవిష్ణు.
కొత్త దర్శకుల నుండి కొత్తదనం వస్తుందనే విషయాన్ని బలంగా నమ్ముతాను. నా సినిమాలతో ఎంతమంది కొత్త దర్శకులు పరిచయవుతున్నారు. అయితే నేను ఇంకా చాలా మందిని మిస్ అవుతున్నాను. అందుకే షూటింగ్ లేకపోతే రోజుకో కొత్త కథను వింటున్నాను. నా లైనప్‌లో రాబోయే కొత్త సినిమాలు కొత్త దర్శకులతోనే అని క్లారిటీ ఇచ్చాడు శ్రీవిష్ణు. ‘కామ్రేడ్ కల్యాణ్’ సినిమా నక్సలిజం నేపథ్యంలో సాగే హాస్య ప్రధానమైన కథ అని చెప్పాడు.
రామ్ అబ్బరాజుతో ఓ సినిమా ప్రారంభిస్తున్నాను. ఆ తర్వాత ‘సామజవరగమన 2’ సినిమా ఉంటుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో సన్నీ అనే ఓ కొత్త డైరక్టర్‌తో ఓ సినిమా చేస్తాను. అలాగే ‘సింగిల్’ సినిమాకు సీక్వెల్ కోసం ఓ కథ సిద్ధం అవుతోందని చెప్పాడు శ్రీవిష్ణు.