ఒకే రోజు ఒకే హీరోకి సంబంధించిన 2 సినిమాలు రిలీజ్ అవ్వడం అనేది గతంలో జరిగింది. సీనియర్ ఎన్‌టిఆర్, కృష్ణ, చిరంజీవి, నందమూరి బాలకృష్ణ,నాని వంటి హీరోల విషయంలో ఇలాంటివి జరిగాయి. ఇది చెప్పుకోవడానికి ఓ అరుదైన రికార్డుగా అనిపించొచ్చు. కానీ వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఒక హీరోకి సంబంధించి 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే.. ఓపెనింగ్స్ దెబ్బతింటాయి. అలాగే ఆ సినిమాలని ప్రమోట్ చేసుకోవడం హీరోకి కూడా ఇబ్బంది.
ధియేటర్ల షేరింగ్ విషయంలో డిస్ట్రిబ్యూటర్లు కూడా గంధరగోళానికి గురవ్వక తప్పదు.పైన చెప్పుకున్న హీరోల సినిమాల విషయంలో కూడా ఈ ఇబ్బందులు తలెత్తాయి. అందుకే ఇలాంటి రికార్డు కోసం ఏ హీరో ప్రయత్నించరు. కానీ శ్రీవిష్ణు(Sree Vishnu) విషయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకునే అవకాశం ఉందంటూ కొద్దిరోజుల నుండి ప్రచారం జరుగుతుంది.
శ్రీవిష్ణు నటించిన ‘మృత్యుంజయ్’ ‘విష్ణు విన్యాసం’ సినిమాలు ఒక రోజు వ్యవధిలో అంటే ఫిబ్రవరి 27న ‘మృత్యుంజయ్’ ఫిబ్రవరి 28న ‘విష్ణు విన్యాసం’ రిలీజ్ అవుతాయి అంటూ ప్రకటనలు వచ్చాయి.ఓటీటీ ఒప్పందాల ఒత్తిడి కారణంగా నిర్మాతలు ఆ డేట్లకి ఫిక్స్ అవ్వాల్సి వచ్చింది. హీరో శ్రీవిష్ణు కూడా ఈ విషయంలో చేసేదేమీ లేదు. అతను హీరో మాత్రమే. రిలీజ్ వ్యవహారాలు అతనికి అనవసరం కూడా..!
కానీ ఒకేసారి 2 సినిమాలని ప్రమోట్ చేయడం అనే వ్యవహారం ఏదైతే ఉందో అది అతనికి తలనొప్పి తెప్పించే విషయమే. అయితే ఇప్పుడు ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది.ఫిబ్రవరి 28న ‘విష్ణు విన్యాసం’ రిలీజ్ అవుతుంది. ‘మృత్యుంజయ్’ వెనక్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సో శ్రీవిష్ణుకి కొంత రిలీఫ్ లభించినట్టే అని చెప్పాలి.