దూకుడు సినిమాతో టాలీవుడ్ టాప్ డైరక్టర్ల జాబితాలో చేరిన శ్రీను వైట్ల పరిస్థితి ప్రస్తుతం ఏమి బాగాలేదు. అతని గత చిత్రాలు ఆగడు, బ్రూస్లీ సినిమాలు పరాజయం అవడంతో కెరీర్ పరంగా ఇబ్బందిలో ఉన్నారు. ఇప్పుడు మెగా హీరో వరుణ్‌తేజ్‌తో ‘మిస్టర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రంతో పూర్వ వైభవం తెచ్చుకోవాలని శ్రీను వైట్ల శ్రమిస్తున్నారు. కెరీర్ పరంగానే కాకుండా అతను ఇంట్లోనూ సమస్యలను ఎదుర్కుంటున్నారు. కొంతకాలం క్రితం భార్యతో కలహాల వల్ల రోడ్డు ఎక్కారు. పోలీసుల చొరవతో గొడవలు సద్దుమణిగినా ఈ డైరక్టర్ కి ప్రశాంతత కరువైంది.
వీటన్నింటికీ ఇంటి వాస్తు బాగాలేకపోవడమే కారణమని పండితుడు చెప్పడంతో శ్రీను వైట్ల ఎంతో ఇష్టపడి కొనుక్కున్న హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని ఇంటిని అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఇంటిని రూ.15 కోట్లకు విక్రయించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఇక్కడ కూడా అతన్ని అదృష్టం వెక్కిరిస్తోందని సమాచారం. మార్కెట్ రేటుకి తక్కువకు భేరం పెట్టినా ఎవరూ ముందుకు రావడం లేదని తెలిసింది. ఈ విషయం తెలిసి సినీ వర్గాల వారు “అయ్యో .. పాపం” అంటున్నారు.