సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి కొత్త హీరో జై కృష్ణ శ్రీనివాస మంగాపురం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మహేష్‌బాబు అన్న కొడుకు కావడంతో ఈ యాక్షన్ లవ్‌స్టోరీపై ఆరంభం నుంచి తెలుగు ఇండస్ట్రీలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రషా తడానీ హీరోయిన్‌గా పరిచయమైంది. టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ప్రజెంటర్‌గా వ్యవహరించిన ఈ మూవీని పి. కిరణ్ నిర్మించారు. గురువారం థియేటర్లలోకి వచ్చిన శ్రీనివాస మంగాపురం ఎలా ఉంది? డెబ్యూ మూవీతో జై కృష్ణ ప్రేక్షకులను మెప్పించాడా? లేదా? అంటే?
కథ: శీను (జై కృష్ణ) కాలేజీ గొడవల కారణంగా సొంత ఊరు బళ్లారికి కొద్ది రోజులు దూరంగా ఉండాలని తిరుపతి వస్తాడు. అక్కడ తొలి చూపులోనే మంగను (రషా తడానీ) చూసి ప్రేమలో పడతాడు.తిరుపతిలో పెద్దిరెడ్డి (కిక్ శ్యామ్) పేరు చెబితే అందరూ భయపడిపోతుంటారు. మంగ….పెద్దిరెడ్డి కూతురు అని తెలిసి కూడా ఆమె వెంటపడతాడు. మంగకు మరో వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. ఎంగేజ్‌మెంట్ అవుతుంది. అయినా శీను తన ప్రేమను మంగకు వ్యక్తం చేస్తాడు. అదే టైమ్‌లో శీనుపై కొందరు ఎటాక్ చేస్తారు.
వారు ఎవరు? బళ్లారిని గడగడలాడించే వెంకటప్పయ్యనాయుడు (మోహన్‌బాబు) మనవడైన వాసు బాబు… తన పేరును శీనుగా మార్చుకొని మంగ ప్రేమ కోసం తిరుపతి ఎందుకు వచ్చాడు? వాసును ప్రాణంగా ప్రేమించిన మంగ అతడిని ఎందుకు గుర్తుపట్టలేదు? కూతురి ప్రేమ విషయం పెద్ది రెడ్డికి తెలిసిందా? శీను ప్రేమను మంగ అర్థం చేసుకుందా? వారు ఒక్కటయ్యారా? వారి జీవితాల్లోకి వచ్చిన వరలక్ష్మి (వాసుకి), స్వతంత్ర బాబు (సీనియర్ నరేష్), బాలు (బ్రహ్మాజీ) ఎవరు? అన్నదే శ్రీనివాస మంగాపురం మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: జై కృష్ణకు హీరోగా ఇదే మొదటి సినిమా. లవర్ బాయ్‌గా, మాస్ హీరోగా రెండు కోణాల్లో సాగే పాత్రలో మెప్పించాడు. డ్యాన్సులు, ఫైట్లతో అదరగొట్టాడు. తొలి సినిమా అనే తడబాటు, కెమెరా ఫియర్ ఎక్కడ కనిపించలేదు. మంగ పాత్రకు రషా తడానీ న్యాయం చేసింది. తెలుగు అమ్మాయిలాగే కనిపించింది. మోహన్‌బాబు పాత్ర సెకండాఫ్‌లోనే ఎంట్రీ ఇస్తుంది. స్క్రీన్ టైమ్ తక్కువే. కానీ తాను కనిపించిన సీన్లలో పవర్ ఫుల్ డైలాగ్స్‌తో మిగిలిన యాక్టర్లందరిని డామినేట్ చేశారు. హీరో తండ్రిగా కిక్‌శ్యామ్ పాత్ర రొటీన్‌గా సాగింది.
కరుడుగట్టిన తండ్రి అన్నట్లుగా పరిచయం చేసి ఆ తర్వాత క్యారెక్టర్ గ్రాఫ్ తగ్గిస్తూ వచ్చారు. మెయిన్ విలన్‌గా అజయ్‌కి ఇలాంటి పాత్రలు కొత్తేం కాదు. సీనియర్ నరేష్, బ్రహ్మాజీ కామెడీ అస్సలు వర్కవుట్ కాలేదు. వాసుకి, ఆదర్శ్ బాలకృష్ణతో పాటు చాలా మందే సీనియర్లు ఉన్నా ఎవరిది పెద్దగా గుర్తుంచుకునే పాత్ర కాదు.
సాంకేతిక నిపుణుల పనితీరు: రొటీన్ స్టోరీని ఎంచుకొని దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కించాడు. స్క్రీన్‌ప్లే కూడా ఆర్ఎక్స్ 100 టైప్ ట్విస్ట్‌లేవి లేకుండా ఫ్లాట్‌గా సాగుతుంది. దర్శకుడి మార్కు ఇది అని చెప్పుకునేలా ఒక్కటంటే ఒక్క సీన్ కూడా కనిపించదు. జీవీ ప్రకాష్ కుమార్ పాటలు బాగున్నాయి. బీజీఎమ్‌మాత్రం అంతగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. సినిమాటోగ్రాఫర్ జయకృష్ణ గుమ్మడి తిరుపతి అందాలను నాచురల్‌గా చూపించారు. ఎడిటర్ మాధవ్ కుమార్ తన కత్తెరకు పనిచెప్పాల్సిన సీన్లు సినిమాలో చాలానే ఉన్నాయి. దర్శకుడి విజన్‌ను నమ్మి నిర్మాతలు అశ్వనీదత్, పి కిరణ్ మాత్రం సినిమా కోసం భారీగానే ఖర్చు చేశారు. కొత్త హీరో మార్కెట్‌కు మించి బడ్జెట్ పెట్టారు.
విశ్లేషణ: సాధారణంగా డెబ్యూ మూవీ అనగానే చాలా మంది హీరోలు లవ్‌స్టోరీ, లేదంటే కామెడీ మూవీ ఎంచుకుంటుంటారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ మనవడు జై కృష్ణ మాత్రం మాస్ యాక్షన్ హంగులతో కూడిన కథతో హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఎంతో మంది సూపర్ స్టార్లను టాలీవుడ్‌కు పరిచయం చేసిన ప్రొడ్యూసర్, ఆర్ఎక్స్ 100 కల్ట్ సినిమా ఇచ్చిన డైరెక్టర్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్…మోహన్‌బాబు లాంటి సీనియర్ యాక్టర్లు ఇలా ఈ సినిమాకు అన్ని పక్కాగా కుదిరాయి. కానీ అసలైన కథ విషయంలో మాత్రం దర్శకనిర్మాతలు కొత్తగా ఆలోచించలేదు.
రొటీన్ టెంప్లేట్ స్టోరీతో శ్రీనివాస మంగాపురం మూవీ రూపొందింది. హీరో…లేదంటే హీరోయిన్ గతం మర్చిపోవడం…మళ్లీ వారిద్దరే తిరిగి ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అదే పాత కథను తిప్పి ఈ సినిమాను తీశారు అజయ్ భూపతి. టేకింగ్ శ్రీనివాస మంగాపురాన్ని కాస్తో కూస్తో నిలబెట్టింది. చాలా వరకు లైవ్ లోకేషన్స్‌లో సినిమాను షూట్ చేశారు. తిరుపతి, బళ్లారి లోకేషన్లలో తీసిన సీన్లు ఈ సినిమాకు ఫ్రెష్‌నెస్‌ను తీసుకొచ్చాయి. జై కృష్ణ, రషా తడానీ కెమిస్ట్రీ వర్కవుట్ కావడం కూడా కలిసొచ్చింది.
ఫస్ట్ హాప్ శీను, మంగ లవ్‌స్టోరీతో సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్‌కు ముందు శీను ఎవరన్నది రివీలయ్యే ట్విస్ట్ బాగుంది. సెకండాఫ్ కంప్లీట్ ఎమోషనల్, యాక్షన్ అంశాలతో సాగించారు. ఫ్లాష్‌బ్యాక్ రివేంజ్ అంశాలతో అజయ్ భూపతి ఇంట్రెస్టింగ్‌గా నడిపించారు. కామెడీపై ఇంకాస్త ఫోకస్ పెడితే బాగుండేది. క్లైమాక్స్ అంత ఎఫెక్టివ్‌గా లేదు. హడావిడిగా ముగించిన ఫీలింగ్ కలుగుతుంది.
ఫోకస్ పాయింట్: శ్రీనివాస మంగాపురం టైటిల్‌లో ఉన్న కొత్తదనం సినిమాలో లేదు. కానీ హీరోగా జై కృష్ణకు మంచి డెబ్యూగా మాత్రం ఈ మూవీ నిలుస్తుంది.
రేటింగ్: 2.25/5