హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి, విలన్ గా మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా మారిన వరలక్ష్మి శరత్ కుమార్, దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో “ఎస్.సరస్వతి” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా కథ అందించడం విశేషం. మరి సినిమా ఏ స్థాయిలో అలరించింది? దర్శకురాలిగా వరలక్ష్మి ఆకట్టుకోగలిగిందా? అనేది చూద్దాం..!!
కథ: ఓ ప్రభుత్వాసుపత్రిలో నర్స్ గా వర్క్ చేస్తున్న లక్ష్మి (వరలక్ష్మి శరత్ కుమార్) తన కూతురు (సరస్వతి) ప్రాణంగా బ్రతుకుతూ ఉంటుంది. ఆగస్ట్ 15 రోజున తన పుట్టినరోజు కూడా కావడంత్ స్కూల్లో ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకోవడం కోసం స్కూల్ కి వెళ్తుంది సరస్వతి.
అయితే.. ఎప్పట్లానే సరస్వతిని స్కూల్ నుంచి పికప్ చేసుకోవడానికి వచ్చిన లక్ష్మికి కూతురు కనిపించదు. స్కూల్ మొత్తం వెతుకుతూ హడావుడి చేస్తుంది. దాంతో పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు.
అసలు సరస్వతి అనే అమ్మాయి 7వ తరగతి బి సెక్షన్ లో మాత్రమే కాదు, తమ స్కూల్లో కూడా లేదని స్కూల్ స్టాఫ్ చెప్పడంతో పోలీసులు కూడా షాక్ అవుతారు.
అసలు సరస్వతికి ఏమైంది? లక్ష్మి తన కూతుర్ని మళ్లీ చూడగలిగిందా? అందుకోసం ఎన్ని ఇబ్బందులుపడాల్సి వచ్చింది? అనేది “సరస్వతి” కథాంశం.
నటీనటుల పనితీరు: ప్రకాష్ రాజ్ ఎంత మంచి నటుడు అనేది మరోసారి ప్రూవ్ రుజువైంది. కథలో బలం లేకపోయినా తన నటనతో సినిమాని నెట్టుకొచ్చాడు. నాజర్, ప్రియమణి, కిషోర్, మురళీశర్మ వంటి ఆర్టిస్టులందరూ తమ సహజమైన నటనతో సినిమాకి హెల్ప్ అయ్యారు.
అయితే.. కీలకపాత్ర పోషించిన వరలక్ష్మి శరత్ కుమార్ సీరియస్ లేదా ఇన్నోసెంట్ లుక్స్ వరకు పర్వాలేదు కానీ, ఎమోషనల్ సీన్స్ & ఏడుపు సన్నివేశాల్లో మాత్రం తేలిపోయింది. సినిమాకి చాలా కీలకమైన సన్నివేశాల్లో ఆమె నటన మైనస్ గా మారింది. అందువల్ల.. అక్కడ ఎమోషన్ కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేరు. ఆ కారణంగా వరలక్ష్మి నటిగా సినిమాకి మైనస్ గా మారింది.
సాంకేతికవర్గం పనితీరు: తమన్ పాటలు సోసోగా ఉండగా, నేపథ్య సంగీతం అక్కడక్కడా మాత్రమే ఎమోషన్ లేదా ట్విస్ట్ లను ఎలివేట్ చేసింది. కథనానికి మాత్రం నేపథ్య సంగీతం పెద్దగా హెల్ప్ అవ్వలేదు.
సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది కానీ.. కలర్ గ్రేడింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సి ఉంది. ఎడిట్ ప్యాటర్న్ ఆసక్తికరంగా ఉన్నా.. ట్రాన్సిషన్స్ సెట్ అవ్వలేదు. రిపీట్ సీక్వెన్సుల్లో కంటిన్యూటీ మిస్ అయ్యింది.
సాయిమాధవ్ బుర్రా అందించిన మూలకథ బాగున్నా.. దాన్ని తెరకెక్కించిన విధానంలో ఎమోషన్ మిస్ అవ్వడంతో అలరించలేకపోయింది.
దర్శకురాలిగా వరలక్ష్మి శరత్ కుమార్ తొలి ప్రయత్నం కావడంతో కొన్ని తప్పులు దొర్లినా పెద్దగా పట్టించుకోలేదు కానీ, ఎమోషన్ సరిగా క్యారీ అవ్వకపోవడం, చైల్డ్ ఎబ్యూజ్ సీక్వెన్సుల తీవ్రతను అవసరమైనదానికంటే ఎక్కువగా చూపించడం ద్వారా ఎమోషన్ ఎలివేట్ అవుతుంది అనుకోవడం మరో మైనస్. అలాగే.. స్క్రీన్ ప్లేలో కొన్ని మ్యాజిక్కులు చేస్తే ఆడియన్స్ ఎగ్జైట్ అయిపోతారని భావించడం కూడా మైనస్ అయ్యింది. సో, ఓవరాల్ గా దర్శకురాలిగా వరలక్ష్మి శరత్ కుమార్ మెప్పించలేకపోయిందని చెప్పాలి.
విశ్లేషణ: విలన్ ని లేదా సమాజాన్ని కన్ఫ్యూజ్ చేసి ప్రధాన పాత్రలు రివెంజ్ తీర్చుకోవడం అనేది ఎప్పటినుండో చూస్తూనే ఉన్నాం. ఆ కన్ఫ్యూజ్ చేసే తీరు మారుతుంది కానీ, ప్యాటర్న్ మాత్రం అదే ఉంటుంది. “సరస్వతి” కూడా అలాంటి సినిమానే. హీరోయిన్ పాత్రకి తగిలించిన ఒక్క మానైక రుగ్మతి తప్ప ఏదీ కొత్తగా చూశామన్న భావన కలిగించదు.
థ్రిల్ అనేది కేవలం స్క్రీన్ ప్లేతో మాత్రమే సాధ్యపడదు, అందుకు దోహదపడే బలమైన సన్నివేశాలు కూడా ఉండాలి. ఆ సన్నివేశాలు, సందర్భాలను వరలక్ష్మి హ్యాండిల్ చేయడంలో కాస్త గట్టిగానే తడబడింది.
ఫోకస్ పాయింట్: స్క్రీన్ ప్లే మ్యాజిక్ మాత్రమే సరిపోదు సరస్వతి!
రేటింగ్: 1.5/5