మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన పొట్టి మాటలతో పదునైన పంచ్ లు వేస్తుంటారు. నటుడు సునీల్ తనదైన స్టైల్లో పంచ్ లతో నవ్విస్తుంటారు. వీరిద్దరూ సినిమాల్లో అడుగు పెట్టక ముందే పంచ్ లతో పోటీ పడేవారంట. త్రివిక్రమ్, సునీల్ కృష్ణానగర్లో అద్దె గదిలో ఉంటూ అవకాశాల కోసం ఎదురు చూసే సమయంలో జరిగిన సరదా సంఘటనల గురించి సునీల్ ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు. “త్రివిక్రమ్ చాలా సింపుల్ గా నా మీద పంచ్ లేస్తుంటాడు. నాకు రీ పంచ్ ఇవ్వాలని ఉంటుంది. ఆ టైం లో నాకు రాదు. అయినా ఎలాగైనా పంచ్ వేయాలని ఆ రోజంతా ఆలోచిస్తాను. ఏ అర్ద రాత్రో నాకు ఓ పంచ్ డైలాగ్ గుర్తుకొస్తుంది. మరిచి పోతానని నిద్ర పోతున్న త్రివిక్రమ్ ని లేపి పంచ్ వేస్తాను. అప్పుడే ప్రశాంతంగా నిద్రపోతాను” అని సునీల్ మిత్రుడుతో గడిపిన రోజులను గుర్తుకు చేసుకున్నారు.
అప్పటినుంచి ఇప్పటి వరకు వీరి మధ్య స్నేహం కొనసాగుతూ ఉంది. త్రివిక్రమ్ డైరక్ట్ చేసిన జల్సా, అతడు, ఖలేజా చిత్రాల్లో సునీల్ కి సూపర్ పంచ్ డైలాగులను రాశారు. హీరోగా సునీల్ బిజీ కావడంతో తన సినిమాల్లో తీసుకోవడం మానేశారు. మళ్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో రానున్న “దేవుడే దిగివచ్చినా..” మూవీ లో సునీల్ కోసం మంచి క్యారక్టర్ ని త్రివిక్రమ్ సృష్టించారని సమాచారం. దీంతో సునీల్ కమెడియన్ గా మళ్లీ ఫామ్లోకి రానుండడం ఖాయం.