తమన్నా అందానికి, ఫిజిక్‌కి, లుక్స్‌కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో.. ఆమె డ్యాన్స్‌కి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ ఉంది అంటే.. అందులో స్పెషల్ డ్యాన్స్ కావాలి అనుకుంటే.. తొలి ప్రయత్నం తమన్నా నుండే ప్రారంభమవుతుంది. ఆమె అలాంటి డ్యాన్సర్‌గా మారడం వెనుక సౌత్ సినిమా ప్రభావం చాలా ఉంది అని చెబుతోంది తమన్నా. ఈ మేరకు ఆమె చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తమన్నా డ్యాన్స్ చూసి అందరూ మురిసిపోవడం వెనుక ఓ కారణం ఉంది. అదే ఆమె ప్రొఫెషనల్ డ్యాన్సర్ కాకపోవడమే. చాలామంది కథానాయికలు సినిమాల్లోకి వచ్చే ముందు ఏదైనా ఓ డ్యాన్స్ నేర్చుకుని వస్తుంటారు. దాని వల్ల సినిమాల్లో స్టెప్పులు వేయడం ఈజీ అవుతుంది అంటుంటారు. కానీ తమన్నాకు అలాంటి పూర్వానుభవం లేదు. ఈ నేపథ్యంలోనే ఆమె డ్యాన్స్ వెనుక చాలా కష్టం ఉంది అని అర్థమవుతుంది. ఇదే మాట ఆమె దగ్గర అంటే.. డ్యాన్స్ అనేది తాను సాధన చేసి నేర్చుకున్నది కాదని చెప్పింది.
దక్షిణాది సినిమా పరిశ్రమల్లో నెట్టుకురావడానికి అదొక ఆయుధంగా మారిందని చెప్పంది. దక్షిణాది సినిమాల్లో భారీ పాటల చిత్రీకరణకు తనకు సమయం దొరికేది కాదని అప్పటి రోజుల్ని గుర్తు చేసుకుంది. నేనెప్పుడూ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోలేదు. దాని కోసం ఎలాంటి సాధన కూడా చేయలేదు. టీనేజ్‌లో దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్నప్పుడు పాటల చిత్రీకరణకు సమయం ఇచ్చేవారు కాదు. భారీ సెట్స్ వేసి వందలాది మంది టీమ్ నా కోసం ఎదురుచూస్తూ ఉండేవారు. ఆ సమయంలో భయపడేందుకు కూడా నాకు తీరిక కూడా ఉండేది కాదని చెప్పింది.
దాంతో అప్పటికప్పుడు కొరియోగ్రాఫర్ చెప్పిన డ్యాన్స్ నేర్చుకుని స్టెప్పులు వేసేదట. తనకు డ్యాన్స్ అలా వచ్చిందని చెప్పింది. ప్రస్తుతం ఆమె నెట్‌ఫ్లిక్స్‌లో సిరీస్ ‘గఫూర్’లో ఓ పాటకు డ్యాన్స్ చేసింది. అదే సమయంలో ‘రేంజర్’ అనే మరో సినిమాలో నటించింది. ‘రేంజర్’ పాట షూటింగ్ పూర్తి చేసి వెంటనే ‘గఫూర్’ పాటకు వెళ్లేదాన్ని. రిహార్సల్స్ చేయడానికి కూడా సమయం ఉండేది కాదు. కెరీర్ ప్రారంభంలో నేర్చుకున్న పాఠాలే ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. వాటి వల్లే నాకు అవకాశాలు వస్తున్నాయి. ఎన్ని భాషల్లోనైనా నటించగలుగుతున్నా అని తన సక్సెస్ సీక్రెట్ చెప్పింది తమన్నా..