Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • దినేష్ తేజ్ (Hero)
  • ధశ్విక కింతల్లి (Heroine)
  • భోగిరెడ్డి శ్రీనివాస్, ప్రమోదిని, కృష్ణ సుక్కు, భరత్ రొంగలి తదితరులు (Cast)
  • అర్జున్ కోలా (Director)
  • వంశీ సీమకుర్తి (Producer)
  • చేతన్ భరద్వాజ్ (Music)
  • భరత్ పట్టి (Cinematography)
  • విప్లవ్ నైషాదం (Editor)
  • Release Date : 2nd అక్టోబ‌ర్‌ 2026
  • ఎస్ కె ప్రొడక్షన్స్ & త్రయతి ఈశాని క్రియెషన్స్ (Banner)

ఈ అక్టోబర్ 2న వరుస పెట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో ‘తత్వం’ కూడా ఒకటి. గతంలో ‘హుషారు’ ‘ప్లే బ్యాక్’ వంటి ప్రామిసింగ్ సినిమాలు అందించిన దినేష్ తేజ్ ఇందులో హీరో. పెద్దగా ప్రమోషన్ లేకుండా చాలా సైలెంట్ గా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. మరి ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఇందులో ఉన్నాయో లేదో తెలుసుకుందాం రండి:

Tatvam Movie Review

కథ: రామాపురం అనే ఒక గ్రామం. ఆ ఊరికి దూరంగా నివసించే మూర్తి, నాగమణి దంపతులు హత్యకు గురవుతారు. ఆ హత్య చేసింది వారి కొడుకే అని ఊరి జనాలంతా భావించి, అతడిని పోలీసులకు అప్పగించేందుకు సిద్ధమవుతారు. అయితే, అదే ఊరికి పెళ్లిచూపుల కోసం వెళ్లిన ఏలూరు కానిస్టేబుల్ కళ్యాణ్ తేజ్ (దినేష్ తేజ్)ను ఆ హత్యకు సంబంధించిన రిపోర్ట్ సేకరించి ఇవ్వాల్సిందిగా పై అధికారి ఆదేశిస్తాడు.

మొదట ఆ ఊరి జనాలు చెప్పినట్లుగా రిపోర్ట్ రాసేందుకు సిద్ధపడిన కళ్యాణ్.. సౌమ్య (ధశ్విక కింతల్లి) మాట మేరకు, పూర్తిగా దర్యాప్తు చేశాకే రిపోర్ట్ రాయాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి అనేక సమస్యలు ఎదురవుతాయి. అసలు మూర్తి, నాగమణి దంపతులను చంపింది ఎవరు? వారి కొడుకు ఈ హత్య కేసు నుంచి ఎలా బయటపడ్డాడు? ఈ కేసును ఛేదించి కళ్యాణ్ ఎస్ఐగా ప్రమోషన్ పొందగలిగాడా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా.

నటీనటుల పనితీరు: దినేష్ తేజ్ ఎప్పటిలానే సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. పోలీస్ లుక్లో అతని మేకోవర్ కూడా బాగుంది. అతని స్క్రిప్ట్ సెలక్షన్ ఎక్కువ శాతం డిజప్పాయింట్ చేసింది లేదు. ‘తత్వం’ కథ కూడా మంచిదే. కానీ అతని సిన్సియర్ ఎఫర్ట్ కి తగ్గ సన్నివేశాలు పడలేదు. హీరోయిన్ ధశ్విక చూడటానికి బాగానే ఉంది. కానీ నటిగా ఆమె ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకో ఈమె లిప్ సింక్ కూడా సెట్ అవ్వలేదు. కిట్టయ్య ఎప్పటిలానే తన మార్క్ డైలాగ్ డెలివరీతో అలరించారు. ప్రమోదిని పర్వాలేదు. మిగతా నటీనటులు ఓకె.

సాంకేతిక నిపుణుల పనితీరు: థ్రిల్లర్ సినిమాల విషయంలో మేకర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పటికే చాలా సినిమాలతో ప్రూవ్ అయ్యింది. కానీ అప్‌కమింగ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరూ దీనిని సీరియస్‌గా తీసుకోవడం లేదేమో అనిపిస్తోంది. ఆర్టిస్టులు డేట్స్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్లనో, లేక బడ్జెట్ సరిపోవడం లేదో కానీ.. ఫోర్స్డ్‌గా కొన్ని అనవసరమైన సన్నివేశాలు తీసి చుట్టేస్తున్నారు.

‘తత్వం’ సినిమా విషయానికి వస్తే.. మర్డర్ ఎపిసోడ్‌తో అందరిలో క్యూరియాసిటీ పెరుగుతుంది. కానీ ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్ తేలిపోయాయి. కథనం ఎక్కడా ముందుకు సాగదు. పైగా అనవసరమైన పాటలు రావడం ఆడియన్స్ మూడ్‌ను డిస్టర్బ్ చేసినట్టు అయ్యింది. మొదటి 15 నిమిషాలు తీసేస్తే.. ఫస్ట్ హాఫ్ అంతా సాగదీతనే. సెకండాఫ్‌లో అయినా నెరేషన్ గ్రిప్పింగ్‌గా ఉందా అంటే.. అదీ లేదు. విలన్‌ను రివీల్ చేసే ఎపిసోడ్ మాత్రం కన్విన్సింగ్‌గా అనిపిస్తుంది.

విలన్ ఎవరు అనేది గెస్ చేయడం అంత ఈజీ కాదు. ఆ ట్రాక్ మాత్రం దర్శకుడు బాగా డిజైన్ చేసుకున్నాడు. మూఢనమ్మకాల వంటి అంశాలను లింక్ చేసిన విధానం కూడా బాగుంది. కానీ ఓ థ్రిల్లర్ సినిమాకు ఈ రెండు పోర్షన్లు సరిపోతాయా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేం. నెరేషన్ గ్రిప్పింగ్‌గా లేనప్పుడు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లోపించినప్పుడు.. థ్రిల్లర్ సినిమాలు వర్కౌట్ కావు. ఆ విషయాన్ని ‘తత్వం’ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. టెక్నికల్‌గా చూసుకున్నా.. ‘తత్వం’ చాలా పూర్ అనే చెప్పాలి. కనీస స్థాయి నిర్మాణ విలువలు లేవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డబ్బింగ్, ఎడిటింగ్.. ఇలా అన్నీ పేలవంగానే ఉన్నాయి.

విశ్లేషణ: ‘తత్వం’ కచ్చితంగా మంచి ఐడియానే..! కానీ ఫస్ట్ హాఫ్ లో మొదటి పావు గంట, సెకండాఫ్లో ట్విస్ట్ రివీలింగ్ ఎపిసోడ్ తీసేస్తే.. డైరెక్షన్ చాలా లేజీగా సాగుతుంది. థ్రిల్లర్ సినిమాలకి ఉండాల్సిన ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడం వల్ల.. ఇదొక వృధా ప్రయత్నంగా మిగిలిపోతుంది.

ఫోకస్ పాయింట్: ట్విస్ట్ బాగుంది.. ట్రీట్మెంట్ బాలేదు

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus