తెలుగు సినిమా అనే కాదు.. మొత్తం సౌత్ సినిమాలో తమన్ సంగీతానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన ఓ సినిమాకు సంగీతం అందిస్తున్నారు అంటే.. ప్రేక్షకులు ఓ స్థాయి సంగీతాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఇబ్బందికర ఫలితాలు అందుకొని ఉండొచ్చు కానీ.. ఆ సినిమాల్లో ఆయన సంగీతానికి ఎక్కడా తక్కువ పేరు రాదు. ముఖ్యంగా ఆయన రూపొందించే నేపథ్య సంగీతానికి ఎప్పుడూ మంచి పేరే వచ్చింది. ఈ రోజు రిలీజ్ అయిన ‘కాకా’ సినిమా టీజర్‌లో కూడా నేపథ్య సంగీతానికి మంచి పేరు వచ్చింది.
గ్లింప్స్‌లో చిరంజీవి పాత సినిమాల పాటల బిట్స్ కొన్ని భలేగా వాడారు అనే ప్రశంసలు తమన్‌కు దక్కుతున్నాయి. ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలోని పాట మ్యూజిక్ ఒకటి ‘కాకా’ నేపథ్య సంగీతంలో వినిపిస్తుంది. ఆ తర్వాత ‘చిక్ చిక్ చేలం..’ పాట మ్యూజిక్ బిట్ వినిపించింది. ఈ రెండూ ‘కాకా’ టీజర్‌కు మంచి యాడ్ ఆన్స్ అని చెప్పొచ్చు. చిరంజీవి పాత పాటలు ఎప్పటికీ మంచి వైబ్ ఇస్తాయి. దీంతో తమన్ ఇప్పుడు చేసిన మిక్సింగ్ బాగా వర్కవుట్ అయిందని చెప్పొచ్చు.
నిజానికి తమన్‌కి ఇది కొత్తేమీ కాదు. ఇటీవల ‘ఓజీ’ సినిమా నేపథ్య సంగీతంలో కూడా ఇదే ప్రయత్నం చేశారు. ‘జానీ’ సినిమా టైటిల్ సాంగ్‌ని సినిమాలో కీలక సమయంలో వాడి ఆ వైబ్‌ని తీసుకొచ్చారు. ఆ తర్వాత ‘తమ్ముడు’ సినిమాలోని పాట, ‘ఖుషి’ సినిమాలో పాటల్ని బాగా వాడారు. దాంతో అవంతా సినిమాకు బాగా కలిసొచ్చాయి. ఇప్పుడు ‘కాకా’ సినిమాలో కూడా ఇలాంటి ప్రయత్నం చేశారనిపిస్తోంది.
‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాలో కూడా ఇలాంటి ప్రయత్నమే చేశారు భీమ్స్ సిసిరోలియో – అనిల్ రావిపూడి. ‘రౌడీ అల్లుడు’ సినిమాలోని పాటలను, మ్యూజిక్‌ను బాగనే వాడేశారు. దీంతో సంగీత దర్శకులకు ఇదొక బెస్ట్ ఆప్షన్‌గా మారింది. ఇదంతా వింటేజ్ సాంగ్స్ వైబ్ మ్యాజిక్.