యాక్షన్ సీన్స్ ని ఓ రేంజ్ లో వెండితెరపై ఆవిష్కరించే బోయపాటి శ్రీను.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో బీభత్సం సృష్టించడానికి సిద్ధమయ్యారు. రామ్ చరణ్ ని ‘రాజవంశస్థుడు’గా చూపించడానికి రెడీ అవుతున్నారు. ఎక్కువభాగం రాజస్థాన్ లో జరిగే ఈ సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ త్వరలో పాల్గొననున్నారు. బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా పేరు ఇదేనంటూ రెండు రోజులుగా ఓ పేరు చక్కర్లు కొడుతోంది. గత చిత్రానికి జయ జానకి నాయక అని పేరు పెట్టి ఆకర్షించిన బోయపాటి ఇందుకు అటువంటి పేరునే పెట్టనున్నట్లు టాక్. జిల్ జిల్ జిగేల్ అనే పేరుని బోయపాటి చరణ్ కి సూచించినట్లు తెలిసింది. ఇక చెర్రీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారం.
ఇందులో రామ్ చరణ్ కి నలుగురు అన్నయ్యలు, వదినలు ఉంటారు. ఇప్పటికే ముగ్గురు అన్నయ్యలుగా తమిళ హీరో ప్రశాంత్ (జీన్స్ హీరో), నవీన్ చంద్ర(అందాల రాక్షసి), ఆర్యన్ రాజేష్ లు ఖరారు అయ్యారు. వదినలుగా అలనాటి హీరోయిన్ స్నేహ, అనన్య (‘జర్నీ’ ఫేం), హిమజ, ప్రవీణలు నటించనున్నారు. నాలుగో అన్నయ్య పేరు మాత్రమే బయటికి రావాల్సి ఉంది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.