నచ్చిన హీరోను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే కోపం రావొచ్చు.. అది తప్పేం కాదు. అయితే నచ్చిన హీరో సినిమాలో నటించను అని మరో యాక్టర్ అంటే కోపం తెచ్చుకుంటే ఎలా? ఆయన్ను ఏదో ఒకటి అనేసి బాధపెట్టడం ఎంత వరకు కరెక్ట్. ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది టాలీవుడ్‌లో. ఈ మాటలు పడుతున్నది ప్రముఖ మలయాళీ నటుడు టొవినో థామస్ కాగా.. దానికి కారణం ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలో ఆయన నటించడం లేదు అని చెప్పడమే. దానికి ఆయన కారణాలు చెప్పినా కొంతమంది వినిపించుకోవడం లేదు.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘డ్రాగన్’. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో టొవినో థామస్ నటిస్తారు అని చాలా రోజుల క్రితం వార్తలొచ్చాయి. ఆ తర్వాత దాదాపు ఫిక్స్ అనే మాటలు వినిపించాయి. అది అవునో కాదో తేలలేదు కాదు కానీ.. తాను నటించడం లేదు అని, తప్పుకున్నానని ఆయనే చెప్పారు. అయితే ఆ తర్వాత ఆయనను ఉద్దేశించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మొదలైంది. దీనిపై ఆయన తాజాగా స్పందించారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. అసలు ఇలాంటివి జరుగుతాయని ఊహించే కొన్ని విషయాలపై మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపించను అని చెప్పారు.
నిన్న ప్రెస్‌మీట్‌లో ఓ విషయం గురించి మాట్లాడాను. నా మాటలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. ‘డ్రాగన్’లో యాక్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అన్నట్లు మాట్లాడుతున్నారు. అది నిజం కాదు. ఇలాంటి సమస్యలు వస్తాయనే నేను చాలా వరకు మౌనంగా ఉంటాను. ఒకే సమయంలో నేను వేర్వేరు పనులు చేయలేను. ఆ మాటే అందరికీ చెప్పాను. నాకు ప్రశాంత్ నీల్ అంటే ఎంతో ఇష్టం. ఆయన వర్కింగ్ స్టైల్ ఇష్టం. అలాగే నాకు సినిమాల్లో నటించడం ఇష్టం. డబ్బు, స్టార్ డమ్ కంటే మూవీ మేకింగ్ ప్రాసెస్‌ను ఇష్టపడతా అని చెప్పాడు టొవినో.