Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • య‌శ్‌ (Hero)
  • న‌య‌న‌తార‌, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వ‌సంత్‌ (Heroine)
  • హ్యుమా ఖురేషి, సుదేవ్ నాయ‌ర్ త‌దిత‌రులు (Cast)
  • గీతూ మోహ‌న్ దాస్‌ (Director)
  • వెంక‌ట్ కే నారాయ‌ణ‌ & య‌శ్‌ (Producer)
  • ర‌వి బ‌స్రూర్‌ (Music)
  • రాజీవ్ ర‌వి (Cinematography)
  • ఉజ్వ‌ల్ కుల‌క‌ర్ణి (Editor)
  • Release Date : 26th ఆగ‌స్ట్‌ 2026
  • కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్‌ (Banner)

కేజీఎఫ్, కేజీఎఫ్ 2తో య‌శ్‌కు (Yash) పాన్ ఇండియ‌న్ వైడ్‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. కేజీఎఫ్ 2 త‌ర్వాత అత‌డు హీరోగా న‌టించిన టాక్సిక్ మూవీ కోసం టాలీవుడ్‌, కోలీవుడ్ అనే భేదాలు లేకుండా అన్ని భాష‌ల ఆడియెన్స్ ఆస‌క్తిగా ఎదురుచూశారు. టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఈ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను రెట్టింపు చేశాయి. గ్యాంగ్‌స్ట‌ర్ పీరియాడిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కిన టాక్సిక్‌కు గీతూమోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. న‌య‌న‌తార‌, రుక్మిణి వ‌సంత్‌, కియారా అద్వానీ, తారా సుతారియా హీరోయిన్లుగా న‌టించారు. కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై వెంక‌ట్ కే నారాయ‌ణ నిర్మించిన ఈ మూవీని తెలుగులో దిల్‌రాజు రిలీజ్ చేశారు. బుధ‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైన టాక్సిక్ ఎలా ఉంది? కేజీఎఫ్ క్రేజ్ య‌శ్‌కు తెలుగులో క‌లిసివ‌చ్చిందా? లేదా? అంటే?

Toxic Movie Review

క‌థ‌: గోవాకు సాల్వ‌డ‌ర్ కింగ్‌మేక‌ర్‌గా ఉంటాడు. సాల్వ‌డ‌ర్ ఆధిప‌త్యానికి చెక్ పెట్టేందుకు అత‌డి త‌మ్ముడు ఫెర్నాండేజ్ ప్ర‌య‌త్నాలు ఫెర్నాండేజ్‌ను చంపి సాల్వ‌డ‌ర్‌కు ద‌గ్గ‌ర‌వుతారు రాయ (Yash), అత‌డి సోద‌రి గంగ‌ (Nayanthara). ఫెర్నెండేజ్ కూతురు రెబెకాను (తారా సుతారియా) రాయ పెళ్లిచేసుకుంటాడు. సాల్వ‌డ‌ర్ త‌ర్వాత అత‌డి సామ్రాజ్యానికి రాయ‌నే అధిప‌తి అని అంద‌రూ ఫిక్స‌వుతారు. అలాంటి టైమ్‌లోనే నాదియా (కియారా అద్వానీ)రాక‌తో రాయ జీవితం మొత్తం త‌ల‌క్రిందుల‌వుతుంది. నాదియాతో ప్రేమ‌లో ప‌డ‌తాడు రాయ‌. ఈ ప్రేమాయ‌ణం వ‌ల్ల‌ రెబెకాతో పాటు గంగ ప్రాణాలు కోల్పోతారు. గంగ‌ను నాదియానే చంపుతుంది. ఈ నిజం తెలుసుకున్న రాయ అనుక్ష‌ణం ప్రియురాలిపై కోపంతో ర‌గిలిపోతుంటాడు. నాదియాను రాయ మ‌ళ్లీ క‌లుసుకున్నాడా? గంగ‌ను నాదియా ఎందుకు చంపింది? అంద‌రూ దూర‌మైన బాధ‌లో ఉన్న రాయ లైఫ్‌లోకి మెల్లిసా (రుక్మిణి వ‌సంత్‌) ఎలా వ‌చ్చింది? రాయ సామ్రాజ్యాన్ని కూల్చాల‌ని ప్ర‌య‌త్నించిన రూమీ (య‌శ్‌) ఎవ‌రు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

న‌టీన‌టుల ప‌నితీరు: టాక్సిక్‌కు య‌శ్ (Yash) వ‌న్ మెన్ షోగా నిలిచాడు. రాయ ,రూమీ రెండు పాత్ర‌ల్లో అత‌డి బాడీలాంగ్వేజ్‌, మ్యాన‌రిజ‌మ్స్ బాగున్నాయి. యాక్ష‌న్ సీన్ల‌లో అద‌ర‌గొట్టాడు. అనుక్ష‌ణ బాధ, ప‌శ్చాత్తాపంతో ర‌గిలిపోయే గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో చ‌క్క‌టి వేరియేష‌న్స్ చూపించాడు. హీరోయిన్ల పాత్ర‌ల‌ను బోల్డ్ , డేరింగ్ డాషింగ్‌గా చూపించారు డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్ దాస్‌. రెగ్యుల‌ర్ హీరోయిన్ల మాదిరిగా ఎవ‌రూ సాఫ్ట్‌గా క‌నిపించ‌రు. య‌శ్ సోద‌రిగా యాక్ష‌న్ రోల్‌లో న‌య‌న‌తార క‌నిపించింది. చాలా వ‌ర‌కు ఎక్స్‌ప్రెష‌న్స్‌తోనే న‌టించింది. హీరోయిన్ల‌లో ఎక్కువ హైలైట్ అయ్యింది కియారానే. ప్రేమ‌కు, చేయ‌ని త‌ప్ప‌కు మ‌ధ్య అనుక్ష‌ణం బాధ‌ప‌డే యువ‌తిగా చ‌క్క‌టి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచింది. య‌శ్ కియారా మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ సాంగ్‌, ఇంటిమేట్ సీన్లు యూత్ ఆడియెన్స్‌ను మెప్పిస్తాయి. తారా సుతారియా, రుక్మిణి వ‌సంత్ పాత్ర‌ల‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త లేదు. నెగెటివ్ క్యారెక్ట‌ర్‌లో హ్యూమా ఖురేషి న‌ట‌న ఒకే.

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: టాక్సిక్ కు డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్‌దాస్‌తో క‌లిసి య‌శ్ క‌థ‌ను అందించారు. ఓ గ్యాంగ్‌స్ట‌ర్ జీవితాన్ని కొంద‌రు మ‌హిళ‌లు ఎలా ప్ర‌భావితం చేశారు? ప్రేమించిన అమ్మాయిపై పెంచుకున్న ద్వేషం, కోపం అత‌డి లైఫ్‌లో ఎలాంటి అల్ల‌క‌ల్లోలాన్ని సృష్టించాయ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌. ఈ పాయింట్‌కు మ‌ల్టీపుల్ డిజార్డ‌ర్ అనే స‌మ‌స్య‌ను జోడించి గీతూ మోహ‌న్ దాస్ టాక్సిక్‌ను తెర‌కెక్కించారు. ఎమోష‌న్స్‌ను వ‌య‌లెన్స్ డామినేట్ చేయ‌డంతో క‌థ ప‌క్క‌దారి ప‌ట్టింది. యాక్ష‌న్ సీక్వెన్స్ మ‌ధ్య‌లో స్టోరీని ఇరికించిన ఫీలింగ్ క‌లుగుతుంది.

ఈ సినిమాకు సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ ర‌వి బ‌స్రూర్‌, సినిమాటోగ్రాఫ‌ర్ రాజీవ్ ర‌వి అస‌లైన హీరోలుగా నిలిచారు. గోవా బ్యాక్‌డ్రాప్‌తో మంచు కొండ‌ల నేప‌థ్యంలో వ‌చ్చే విజువ‌ల్స్ టాప్ నాచ్‌లో ఉన్నాయి. ర‌వి బ‌స్రూర్ త‌న బీజీఎమ్‌తోనే చాలా చోట్ల క‌థ‌లో లీన‌మ‌య్యేలా చేశాడు. య‌శ్‌పై ఉన్న న‌మ్మ‌కంతో నిర్మాత వెంక‌ట్ కే నారాయ‌ణ హాలీవుడ్ లెవెల్‌లో ఈ సినిమాను నిర్మించారు. సినిమా స‌గం బ‌డ్జెట్ యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌కే వెచ్చించారు. ర‌న్ టైమ్ ఈ సినిమాకు మెయిన్ విల‌న్‌గా మారింది. తెలుగు వెర్ష‌న్ మూడు గంట‌ల ప‌ధ్నాలుగు నిమిషాలు ఉంది. ఈజీగా ముప్ఫై నిమిషాలు క‌ట్ చేయ‌చ్చు.

విశ్లేష‌ణ‌: కేజీఎఫ్‌తో హీరో యశ్ ఓవ‌ర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయాడు. హీరోయిజం, ఎలివేష‌న్ల‌కు కొత్త అర్థాన్ని ఇచ్చింది ఈ మూవీ. కేజీఎఫ్ స్ఫూర్తితో గ్యాంగ్‌స్ట‌ర్ సినిమాలు ద‌క్షిణాదిలో చాలా సినిమాలు వ‌చ్చాయి. కానీ త‌న సినిమానే స్ఫూర్తిగా తీసుకొని య‌శ్ టాక్సిక్ సినిమా చేశాడు. టాక్సిక్‌లో హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌, వ‌య‌లెన్స్‌, మేకింగ్ అడుగ‌డుగునా కేజీఎఫ్‌ను గుర్తుకుతెస్తాయి.

ఐదుగురు మ‌హిళ‌ల‌తో ముడిప‌డిన ఓ గ్యాంగ్‌స్ట‌ర్ జీవితాన్ని భావోద్వేగ‌భ‌రితంగా చూపించేందుకు మంచి ఛాన్స్ ఉంది. పెళ్లిచేసుకున్న‌ భార్య‌…తోడ‌బుట్టిన అక్క‌…ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలి జ్ఞాప‌కాల‌తో జీవించే ఓ గ్యాంగ్‌స్ట‌ర్ లైఫ్‌తో ఈ క‌థ‌ను రాసుకున్నారు. రాత‌లో ఉన్న ఎమోష‌న‌ల్ క‌నెక్టివిటీ తీత‌లో మిస్స‌య్యింది. ఆ దిశ‌గా దృష్టి సారిస్తే య‌శ్ కెరీర్‌కు మంచి ఛేంజ్ ఓవ‌ర్‌లా ఈ మూవీ నిలిచిపోయుండేది.

క‌థ‌పై కాకుండా కేజీఎఫ్‌తో య‌శ్‌కు వ‌చ్చిన ఇమేజ్‌ను ద‌ర్శ‌కురాలు ఎక్కువ‌గా ఆధార‌ప‌డ్డారు. య‌శ్ కూడా సినిమాలో చాలా స్టైలిష్‌గా క‌నిపించాడు. త‌న యాక్టింగ్‌తోనే ఈ సినిమాను లాక్కొచ్చారు. అత‌డు చెప్పే ప్ర‌తి డైలాగ్ థియేట‌ర్ల‌లో విజిల్స్ వేయిస్తాయి. క్లైమాక్స్‌లో న‌ట విశ్వ‌రూపం చూపించాడు. రెండు పాత్ర‌ల్లో వేరియేష‌న్ చూపిస్తూ అద్భుత న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. రాయ‌, రూమీ పాత్ర‌ల‌కు సంబంధించి వ‌చ్చే ట్విస్ట్ బాగుంది.

ఫోక‌స్ పాయింట్‌: టాక్సిక్ డిఫ‌రెంట్ గ్యాంగ్‌స్ట‌ర్ మూవీ – య‌శ్ యాక్టింగ్ కోసం చూడొచ్చు.

రేటింగ్: 2/5

Click Here To Read in ENGLISH

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus