వడ్డే నవీన్ (Vadde Naveen) గతంలో ఫ్యామిలీ సినిమాలతో హిట్లు ఇచ్చి ఆడియన్స్ ను ఆకట్టుకుని క్రేజ్ సంపాదించుకున్న హీరోనే.కానీ తర్వాత మారుతున్న ట్రెండ్ కు తగ్గట్టు కథలు ఎంపిక చేసుకోవడంలో తడబడ్డాడు. ఫలితంగా ఫ్లాపులు మూటగట్టుకున్నాడు. అందుకే అనుకుంట అతను సినిమాలకి దూరం అయ్యాడు. అయితే 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ హీరోగా ఓ సినిమా చేశాడు. అదే ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. ఈ సినిమాకి నిర్మాత కూడా వడ్డే నవీన్ కావడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. టీజర్, ట్రైలర్ వంటివి పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. కానీ ‘వడ్డే నవీన్ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది’ అనే పాజిటివ్ ఫీలింగ్ అయితే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ లో కనిపిస్తుంది. మరి అందుకు తగ్గట్టు ఈ సినిమా ఉందో లేదో తెలుసుకుందాం రండి :
కథ: ప్రియమ్మ అనే గిరిజన యువతిని రాజకీయ పలుకుబడి ఉన్న ఓ యువకుడు మద్యం మత్తులో దారుణంగా రేప్ చేస్తాడు. అతని బారి నుండీ తప్పించుకుని పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన ఆమెకు శ్రీనివాసులు( దేవీ ప్రసాద్) సాయం అందించాలని ప్రయత్నిస్తాడు. కానీ పై అధికారి వచ్చి ప్రియమ్మే .. ఆ రాజకీయ నాయకుడిని డబ్బు కోసం వేధించించినట్టు రివర్స్ లో ఎఫ్ ఐ ఆర్ రాయిస్తాడు. పై అధికారిని ఎదురించలేని శ్రీనివాసులు ఆ అమ్మాయిని తప్పించేందుకు ప్రయత్నిస్తాడు. కానీ పై అధికారి అలాగే రాజకీయ పలుకుబడి కలిగిన యువకుడు ఇతని పై దాడి చేయడంతో ఏమీ చేయలేకపోతాడు. ఆ డిప్రెషన్ తోనే అతను ప్రాణాలు విడుస్తాడు.పారిపోయిన ప్రియమ్మ కూడా ఒక లోయలో పడిపోతుంది. తర్వాత కొంత కాలానికి శ్రీనివాసులు కొడుకు త్రిమూర్తులు పోలీస్ కానిస్టేబుల్ అవుతాడు. పేరుకు కానిస్టేబుల్ అయినప్పటికీ నిజాయితీగా డ్యూటీ చేయడం వల్ల ఇతను 55 సార్లు ట్రాన్స్ఫర్ అవుతాడు. త్రిమూర్తులు భార్య లక్ష్మీ( రాశీ సింగ్) కూతురు( ఊహ) కూడా అతని డ్యూటీకి అడ్డుపడకుండా సపోర్ట్ చేస్తుంటారు. అయితే ఒక పార్టీ మీటింగ్ కి బందోబస్తుగా వెళ్ళిన త్రిమూర్తులు… హోమ్ మినిస్టర్ కమల(శిల్ప తులస్కర్), ఆమె కొడుకు సంతోష్ బాబుకి అనుకోని విధంగా ఓ ప్రాబ్లం తెచ్చిపెడతాడు.
దీంతో కొడుకుని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి.. తాను ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలని ప్రయత్నించిన కమల్ ప్లాన్ దెబ్బతింటుంది. దీంతో భవిష్యత్తులో వాళ్ళ రాజకీయ ఎత్తుగడలకి త్రిమూర్తులు అడ్డుపడకూడదని భావించి అతన్ని ట్రాన్స్ఫర్ చేయిస్తారు. ఇందులో భాగంగా అనుకోని విధంగా తన తండ్రి పనిచేసిన పోలీస్ స్టేషన్ కి వెళతాడు త్రిమూర్తులు. అక్కడ అతను ఒక్కడే ఉండటంతో పాత ఫైల్స్ అన్నీ చదువుతాడు. ఈ క్రమంలో అతనికి తన తండ్రి రాసిన ప్రియమ్మ ఎఫ్ ఐ ఆర్ దొరుకుతుంది. దాని ద్వారా ప్రియమ్మని రేప్ చేసింది కమల కొడుకు సంతోష్ బాబు అని తెలుస్తుంది. ఆ తర్వాత త్రిమూర్తులు ఏం చేశాడు? ప్రియమ్మ ఏమైంది? ఆమెకి న్యాయం చేసి తన తండ్రి చివరి కోరికని తీర్చాడా? అనేది మిగిలిన కథ?
నటీనటుల పనితీరు: వడ్డే నవీన్ 55 ఏళ్ళ వయసులో కూడా 30 ప్లస్ లా కనిపించాడు. అప్పుడెలా ఉండేవాడో ఇప్పుడు కూడా అంతే హ్యాండ్యమ్ గా కనిపించాడు అని చెప్పాలి. కాకపోతే డ్యాన్సుల్లోనూ, ఫైట్స్ లోనూ వడ్డే నవీన్ ఏజ్ కనిపించేస్తుంది. డ్యాన్సుల్లో కొంత కవర్ చేసినా ఫైట్స్ లో చాలా ఇబ్బంది పడ్డాడు. రన్నింగ్ సీక్వెన్స్ ..లలో కూడా అతను పడ్డ ఇబ్బంది తెలిసిపోతుంది. వడ్డే నవీన్ గత సినిమాల్లో ఎక్కువ శాతం వేరే ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పేవారు. కానీ ఈ సినిమాలో వడ్డే నవీన్ ఓన్ డబ్బింగ్ చెప్పుకున్నాడు. నవీన్ వాయిస్ ఎందుకో సెట్ అవ్వలేదు. రాశీ సింగ్ భార్య పాత్రలో బాగానే సెట్ అయ్యింది. కానీ ఆమె పాత్ర ఇంటికి, వంటింటికి మాత్రమే పరిమితమైంది అని చెప్పాలి. కూతురిగా బేబీ ఊహా ఓకె. విలన్ శిల్ప చూడటానికి గంభీరంగా కనిపించింది. కానీ ఈమె కూడా నడవడానికి చాలా ఇబ్బంది పడింది. ఈమె కొడుకు పాత్రలో చేసిన మెయిన్ విలన్ పాత్ర అంతగా పండలేదు. దేవి ప్రసాద్ ఉన్నంత వరకు ఓకె. అపోజిషన్ లాయర్ గా చేసిన వడ్లమాని శ్రీనివాసరావు మాత్రం తన మార్క్ పెర్ఫార్మెన్స్ తో మెప్పిస్తాడు. మిగతా నటీనటులు జస్ట్ ఓకె.
సాంకేతిక నిపుణుల పనితీరు: కథగా చెప్పుకుంటే ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ బాగానే అనిపిస్తుంది. నవీన్ వంటి సీనియర్ హీరో రీ ఎంట్రీకి ఇది తగ్గ కథే. కానీ ఈ కథని దర్శకుడు ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. కథనం అంతా ఓల్డ్ స్టైల్ లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో పార్టీ మీటింగ్ సీన్ ను మినహాయిస్తే ఆకట్టుకునే సన్నివేశం ఒక్కటి కూడా ఉండదు. సందర్భం లేకుండా వచ్చే పాటలు కూడా ఇరిటేట్ చేస్తాయి. ఇంటర్వెల్ వరకు కోర్ పాయింట్ పై ఆడియన్ కి ఒక క్లారిటీ రాదు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ బెటర్ అనిపిస్తుంది.
అలా అని బాగుంది అని చెప్పలేం. అక్కడ కూడా లేజీ స్క్రీన్ ప్లేతోనే సాగుతుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో 4,5 మంచి సీన్లు ఉంటాయి అంతే. దర్శకుడు కమల్ తేజ కథకుడిగా ఓకె అనిపించినా దర్శకుడిగా ఫెయిల్ అయ్యాడు. నిర్మాణ విలువలు మాత్రం కథకి తగ్గట్టు ఉన్నాయి. ఎక్కడా రాజీపడకుండా ఖర్చు చేశారు. సినిమాటోగ్రఫీ ఓకె. అందరికంటే ఎక్కువగా సంగీత దర్శకుడు డ్యూటీ చేశాడు అని చెప్పాలి. ఒక దశలో ప్రేక్షకులు నిద్రపోయే స్టేజికి వెళ్లిపోతే.. ‘ఇప్పుడు ఏదో జరగబోతుంది లేవండ్రా’ అని అనుకునే ఇంపాక్ట్ తన ఆర్ ఆర్ తో క్రియేట్ చేశాడు. పాటలు కూడా బాగానే ఉన్నాయి. కానీ ఇంతకు ముందు చెప్పుకున్నట్టు.. వాటి ప్లేస్మెంట్ బాలేదు.
విశ్లేషణ: ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనేది మంచి పోటెన్షియాలిటీ ఉన్న కథే. కానీ డైరెక్షన్ ఓల్డ్ స్టైల్ లో ఉండటం.. సీరియస్ గా సాగాల్సిన కథనంలో అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ ఇరికించడంతో ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడుతుంది అని చెప్పాలి.
ఫోకస్ పాయింట్: కష్టం త్రిమూర్తులు
రేటింగ్: 2/5