పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయు వేగంతో సినిమాలను కంప్లీట్ చేసేందుకు సిద్ధమయ్యారు. కొంతకాలంగా పవన్ ఫ్యాన్స్ ని ఊరిస్తున్న మాటల మాంత్రికుడి కాంబినేషన్లో మూవీ త్వరలో పట్టాలెక్కనుంది. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో “కాటమరాయుడు” చిత్రీకరణలో పవన్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షెడ్యూల్ గ్యాప్ లో త్రివిక్రమ్ కోసం కొన్ని డేట్స్ కేటాయించారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ ఇప్పటికే పాటల కంపోజింగ్ లో నిమగ్నమయ్యారు.
“దేవుడే దిగి వచ్చినా..” అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం ముహూర్తపు తేదీని తాజాగా ఫిక్స్ చేశారు. నవంబర్ 5 వ తేదీన పూజా కార్యాక్రమాలు జరిపి, వెంటనే రెగ్యులర్ షూటింగ్ చేయనున్నట్లు తెలిసింది. “కాటమరాయుడు”, “దేవుడే దిగి వచ్చినా..” .. రెండింటిని సమాంతరంగా కంప్లీట్ చేయాలనీ పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ చిత్రాలు రిలీజ్ కాకముందే ఏఎం రత్నం నిర్మాణంలో పవర్ స్టార్ మరో చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. తమిళ దర్శకుడు నీశన్ డైరక్ట్ చేయనున్న ఆ సినిమాకు పూజా కార్య క్రమాలు దసరా రోజున నిర్వహించారు. పవన్ స్పీడ్ చూస్తుంటే వచ్చే ఏడాది మూడు చిత్రాలు రిలీజ్ కావడం పక్కాగా అయ్యేట్టు ఉన్నాయి.