మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయనున్న ప్రాజెక్టులు ఖరారు అయ్యాయి. ఆయన వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు తీయనున్నారు. ఆ..ఆ తర్వాత సొంత ఇంటి నిర్మాణ పనుల్లో ఉన్న మాంత్రికుడు పవన్ కోసం కథను సిద్ధం చేసాడు. ప్రస్తుతం పవర్ స్టార్ కాటమరాయుడు చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అది పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్ కోసం డేట్లు కేటాయించారు. జనవరి నుంచి పవన్, మాటల మాంత్రికుడి కాంబినేషన్లో సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం.ఇందుకోసం వంద కోట్లు ఖర్చు చేయడానికి నిర్మాత రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు.
దీని తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తొలి సారి త్రివిక్రమ్ డైరక్ట్ చేయనున్నారు. తారక్ జనతా గ్యారేజ్ తర్వాత పూరి జగన్నాథ్ డైరక్షన్లో సినిమా చేయనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఫిల్మ్ కంప్లీట్ అయిన తర్వాత త్రివిక్రమ్ తో కలిసి పనిచేయనున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్లో రానున్న సినిమా పై భారీ అంచనాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.